logo

మహిళ దారుణ హత్య

ఒడిశా రాష్ట్రం పర్లాఖెముండి సమీపంలోని పాటికోట గ్రామానికి చెందిన శాసనం ఆరుద్ర (35) సారవకోట మండలం నౌతళ సమీపంలో హత్యకు గురైంది. పాతపట్నం సీఐ ఎన్‌.సాయి, సారవకోట ఎస్సై జి.అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 28 Feb 2024 03:59 IST

వివాహేతర సంబంధమే కారణం!

ఆరుద్ర (పాత చిత్రం)

సారవకోట, పాతపట్నం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రం పర్లాఖెముండి సమీపంలోని పాటికోట గ్రామానికి చెందిన శాసనం ఆరుద్ర (35) సారవకోట మండలం నౌతళ సమీపంలో హత్యకు గురైంది. పాతపట్నం సీఐ ఎన్‌.సాయి, సారవకోట ఎస్సై జి.అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కలి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆరుద్రకు పాటికోటకు చెందిన సోమేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరుద్ర కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఓ శుభకార్యానికి  హాజరయ్యేందుకు ఈ నెల 23న రంగాపురం వచ్చి.. అదే రోజు తిరుగు ప్రయాణమైంది. ఆమెను సోదరుడు లోకేశ్వరరావు తెంబూరులో ఆర్టీసీ బస్సు ఎక్కించి వెళ్లిపోయాడు. పాతపట్నం వచ్చిన ఆమె కూరగాయల వ్యాపారం వల్ల పరిచయమైన ఒడిశా రాష్ట్రం గుసాని బ్లాక్‌ కంట్రగడకు చెందిన ఆటో డ్రైవర్‌ ఊడు పాపారావును కలిసింది. ఇద్దరూ ఆటోలో పాతపట్నం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని నౌతళ ఘాట్‌కు సమీపంలోని తోటకు వెళ్లి ఏకాంతంగా గడిపారు. భర్త వద్దకు వెళ్లనని, తనతోనే తీసుకెళ్లాలని ఆరుద్ర కోరగా పాపారావు నిరాకరించాడు. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తీసుకెళ్లడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఆరుద్ర కింద పడటంతో తలకు రాయి తగిలి గాయమైంది. అనంతరం పాపారావు అక్కడే ఉన్న రాయితో తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం నిందితుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఘటన జాతీయ రహదారికి సుమారు 70 మీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి, తదితరులు

కాల్‌డేటా ఆధారంగా నిందితుడి గుర్తింపు..

ఈనెల 23న బస్సు ఎక్కిన ఆరుద్ర పాటికోట చేరలేదని తెలుసుకున్న తమ్ముడు లోకేశ్వరరావు పాతపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు 24న అదృశ్యం కేసు నమోదు చేశారు. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఏడు నెలలుగా పాపారావుతో మాట్లాడుతున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని ఘటనా స్థలానికి మంగళవారం తీసుకొచ్చారు. పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న ఆరుద్ర మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా పంచనామా నిర్వహించి, పాతపట్నంలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయాన్ని తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, పాతపట్నం, నరసన్నపేట సీఐలు ఎన్‌.సాయి, ప్రసాదరావు, పాతపట్నం, సారవకోట ఎస్సైలు మహమ్మద్‌ యాసిన్‌, జి.అప్పారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పాతపట్నం సీఐ ఎన్‌.సాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని