logo

భయం గుప్పిట చదువులు..!

విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని వైకాపా పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బడుల రూపురేఖలు మార్చామని ప్రకటనలు చేస్తున్నా జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలలు శిథిల స్థితిలో ఉన్నాయి.

Updated : 28 Feb 2024 06:12 IST

శిథిల భవనాల్లో తరగతుల నిర్వహణ
న్యూస్‌టుడే, లావేరు

లావేరు మండలం కొత్తరౌతుపేటలో శిథిలమైన తరగతి గదిలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు

విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని వైకాపా పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా బడుల రూపురేఖలు మార్చామని ప్రకటనలు చేస్తున్నా జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలలు శిథిల స్థితిలో ఉన్నాయి. బీటలు వారిన తరగతి గదుల్లోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లావ్యాప్తంగా 2,653 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిల్లో 1,91,394 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిల్లో సుమారు 1,250 ‘నాడు-నేడు’లో అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. అందులో కొన్ని చోట్ల పనులు ఇంకా జరగాల్సి ఉన్నా.. అసలు ఎంపిక కాకుండా శిథిలావస్థలో ఉన్న బడులు దాదాపు 250 వరకు ఉన్నాయి చాలా చోట్ల పైకప్పులు పెచ్చులూడిపోయి ఇనుప ఊచలు బయటకొచ్చేస్తున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా నీరు లోపలకు రావడం వంటి అనేక సమస్యలు విద్యార్థులు, ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి.

గత్యంతరం లేక అక్కడే..

సుమారు 60 ఏళ్ల కిందట నిర్మించిన ప్రభుత్వ బడులు వందల్లో ఉన్నాయి. వాటికి అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మతులు చేపట్టడం తప్ప కొత్త భవనాలు నిర్మించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించి అక్కడ తరగతులు నిర్వహించడం శ్రేయస్కరం కాదని సూచించినప్పటికీ గతిలేక అక్కడే ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రతిపాదనల మేరకే నాడు-నేడు కార్యక్రమంలో అభివృద్ధికి పాఠశాలలు ఎంపిక చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల బాగున్న బడులకు నిధులు మంజూరు చేశారని, మరికొన్ని ప్రాంతాల్లో అత్యవసరమైనా పట్టించుకోలేదని వాపోతున్నారు.

మచ్చుకు కొన్ని ఇలా..

  • లావేరు మండలం కొత్తరౌతుపేట ప్రాథమిక పాఠశాలను 1960లో నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా గదులన్నీ జలమయమవుతున్నాయి. రెండు గదుల్లో పైకప్పు పెచ్చులూడిపడుతున్నాయి. గోడలు బీటలు వారడంతో చెట్ల వేర్లు తరగతి గదుల్లోకి వచ్చేస్తున్నాయి.
  • సరుబుజ్జిలి మండలం బప్పడాం, బురిడివలస కాలనీ, అమృత లింగానగరం, పెద్దపాలెం, రావివలస, పాలవలస, సుభద్రాపురం, రొట్టవలస తదితర పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. బురిడివలస కాలనీలో భవనంపై కప్పు పూర్తిగా దెబ్బతినడంతో చిన్నపాటి వర్షానికే కారిపోతోంది. పరాయి పంచన తరగతులు నిర్వహిస్తున్నారు.
  • బూర్జ మండలం ఉప్పినవలస జడ్పీ ఉన్నత, నారాయణపురం, పీఎల్‌ దేవిపేట ప్రాథమిక పాఠశాలల భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. నాడు-నేడు కింద అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురవుతున్నారు.
  • ఎచ్చెర్ల మండలం సాకివానిపేట, మూసవానిపేట, బమ్మిడివానిపేట, రణస్థలం మండలం పాతర్లపల్లి ఎస్సీ కాలనీ, కుమ్మరిపేట, గిరివానిపాలెం, మత్స్యకార గ్రామాల్లో బడులు అధ్వానంగా ఉన్నప్పటికీ పాఠాలు బోధిస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం... శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో ప్రాథమిక బడులను పరిశీలించి నివేదికలు రూపొందిస్తాం.

ఆర్‌.సూర్యకుమారి, డిప్యూటీ డీఈవో, శ్రీకాకుళం డివిజన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని