logo

డిజిడల్‌ గ్రంథాలయాలు..!

గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

Published : 28 Feb 2024 04:03 IST

ఏళ్లు గడిచినా అందుబాటులోకి రాని నిర్మాణాలు
న్యూస్‌టుడే, పొందూరు, కొత్తూరు, పోలాకి

సరుబుజ్జిలి: షళంత్రిలో డిజిటల్‌ గ్రంథాలయానికి కేటాయించిన స్థలం

గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూస్తామని వారిలో ఆశ రేకెత్తించారు. స్థలాలు కూడా ఎంపిక చేశామని, నిర్మాణాలు పూర్తి చేసేస్తామని ఊరూరా ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ ఒక్క భవనం కూడా అందుబాటులోకి రాలేదు. నిధుల కొరతతో చాలా చోట్ల ప్రగతి పడకేసింది.

జిల్లాలోని ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో 195 డిజిటల్‌ గ్రంథాలయాలను మంజూరు చేశారు. ఉపాధి హామీ నిధులు రూ.16 లక్షలు చొప్పున కేటాయించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థలం విషయంలోనూ 690 చదరపు అడుగుల్లో నిర్మించాలని సూచించారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలంలో నాలుగు నుంచి తొమ్మిది వరకు భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. అందులో ఒక్కటీ పూర్తి కాలేదు. 22 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల స్థలాల కేటాయింపులో జాప్యంతో పాటు గుత్తేదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.

కొన్నిచోట్ల ఇంకా వెతుకులాటే..

తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 120 భవనాల కోసం స్థలాలు గుర్తించారు. మిగిలిన చోట్ల కూడా వెతుకులాట కొనసాగుతోంది. వాస్తవానికి ఈ పనులు గతేడాది డిసెంబరు నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉన్నా.. అది జరగలేదు. స్థలాలు ఉన్నచోట కూడా పనులు చేసేందుకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. వీటి ద్వారా వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, కంప్యూటర్లు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అన్ని సదుపాయాలు సమకూరుతాయనుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది.


చర్యలు తీసుకుంటున్నాం

జిల్లాలో డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని వివిధ దశల్లో ఆగాయి. గుత్తేదారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం.

వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని