logo

కోతలతో ‘ఏడు’పిస్తున్నారు...!

త్రీఫేజ్‌ పంపుసెట్లకు 400 వాట్స్‌ సరఫరా అవసరం. లోవోల్టేజీ కారణంగా 300 వాట్స్‌ రావడంతో మోటార్ల నుంచి నీరు రావడం తగ్గిపోయి తరచూ అవి మరమ్మతులకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

Published : 28 Feb 2024 04:06 IST

వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్తు సరఫరా
ఎండుతున్న రబీ పంటలు
న్యూస్‌టుడే, రణస్థలం గ్రామీణం, ఎచ్చెర్ల, గుజరాతీపేట(శ్రీకాకుళం), లావేరు

లావేరులో ఎండుతున్న మొక్కజొన్న పంట

త్రీఫేజ్‌ పంపుసెట్లకు 400 వాట్స్‌ సరఫరా అవసరం. లోవోల్టేజీ కారణంగా 300 వాట్స్‌ రావడంతో మోటార్ల నుంచి నీరు రావడం తగ్గిపోయి తరచూ అవి మరమ్మతులకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండ తీవ్రత పెరగడం.. మరోవైపు విద్యుత్తు కోతలు ప్రారంభమవ్వడంతో అన్నదాతలు సతమతమవుతున్నారు. రబీలో వేసిన మొక్కజొన్న, కూరగాయలు, అరటి, పుచ్చ, టమాట, చెరకు, రాగులు, బొప్పాయి, అపరాలు, మిరప, వేరుశనగ తదితర పంటలకు పూర్తిస్థాయిలో నీరందక ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఇస్తామని చెప్పి ఏడు గంటలకు కుదించేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదేనా అన్నదాతలకు ఇచ్చే భరోసా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.

రణస్థలం సబ్‌ డివిజన్‌ పరిధిలో 15,249 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. రబీలో అన్నిరకాల పంటలు కలిపి సుమారు 12 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సకాలంలో సాగునీరు అందించకపోవడంతో ఎండిపోతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే చేతులెత్తేస్తున్నారు. త్రీఫేజ్‌ సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లు: 29,953
రోజుకు విద్యుత్తు వినియోగం: రెండు లక్షల యూనిట్లు


ఎప్పుడిస్తారో తెలియడం లేదు..

ఏడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. సకాలంలో సాగునీరు అందక పంట సగానికి పైగా దెబ్బతింది. కోసే సమయానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడు గంటలే కరెంట్‌ ఇస్తున్నారు. అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు.

ఇనపకుర్తి తోటయ్యదొర, కేశవరాయపురం, లావేరు మండలం


పవర్‌గ్రిడ్‌లో సాంకేతిక లోపంతోనే..

పవర్‌ గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తితే వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో కొంత అంతరాయం కలుగుతోంది. ప్రత్యేకంగా కోతలు విధించడం లేదు.

నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్‌ఈ, శ్రీకాకుళం సర్కిల్‌, ఈపీడీసీఎల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని