logo

ఇసుక పోగులు.. అక్రమాలకు సాక్ష్యాలు..!

అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇసుక రవాణాకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అనుమతులున్న ఇసుక రేవు ఒక్కటీ లేకపోయినప్పటికీ తవ్వకాలు జరిగిపోతున్నాయి.

Updated : 28 Feb 2024 06:11 IST

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

టెక్కలిలో వేసిన ఇసుక నిల్వలు

అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇసుక రవాణాకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అనుమతులున్న ఇసుక రేవు ఒక్కటీ లేకపోయినప్పటికీ తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఎవరైనా అడిగితే తమ వద్ద అనుమతులున్నాయని దబాయిస్తున్నారు. యంత్రాంగానికి విషయం తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇసుక నిల్వ చేయట్లేదని, త్వరలో ఏర్పాటు చేస్తామని చెబుతుండటం గమనార్హం.

జిల్లా వ్యాప్తంగా గతంలో పురుషోత్తపురం, లుకలాం, ఆంబళ్లవలస, గోపాలపెంట, దొంపాక, పురుషోత్తపురం-2, వెంకటాపురం, ముద్దాడపేటల వద్ద రేవులు ఉన్నాయి. ఎన్జీటీ ఆదేశాల మేరకు వాటికి మాన్యువల్‌ పద్ధతిలో ఇసుక తవ్వేందుకు అధికారులు పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేశారు. 2023లో జరిగిన డీఎల్‌ఎస్‌ఏ సమావేశంలో మరో 5 చోట్ల(హయాతీనగరం, నివగాం, దూసి, బట్టేరు, బూరవల్లి) వద్ద రీచ్‌లను గుర్తించి కొత్తగా ఈసీలకు అర్జీ పెట్టారు. కానీ అనుమతులు రాలేదు. దీంతో పాటు కొత్తగా మడపాం, చేనువలస, ఉప్పరిపేట, కొబగాం-కామేశ్వరిపేట, దొంపాక, కిల్లిపాలెం, పర్లాం, ముద్దాడపేట, భైరి, పొన్నాం, నైర, అంధవరం ప్రాంతాల్లో రీచ్‌లు ప్రారంభించాలని నిర్ణయించారు. వాటన్నింటికీ అనుమతులు వచ్చాక గుత్తేదారు సంస్థకు అప్పగిస్తామని కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ(డీఎల్‌ఎస్‌ఏ) సమావేశంలో మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అనుమతులతో సంబంధం లేకుండా గుత్తేదారు సంస్థ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతోంది.

ఈ నిల్వలు ఎక్కడివి..?

కలెక్టరేట్‌లో ఈనెల 24న నిర్వహించిన డీఎల్‌ఎస్‌ఏ సమావేశంలో జిల్లాలో ఆరు (పలాస, టెక్కలి, నైర, చెవ్వాకులపేట, రామకృష్ణాపురం, కంచిలి) ఇసుక స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి వర్షాకాలంలో ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని గనుల శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. రెండు వారాల కిందట నుంచి చెవ్వాకులపేట రేవు నుంచి తీసుకెళ్లిన ఇసుకను టెక్కలిలో నిల్వ చేస్తున్నారు. టెెక్కలి ఆర్టీసీ డిపో పక్కన ఉన్న నిల్వలే ఇందుకు సాక్ష్యం. కొత్తూరు మండలం అంగూరులో వంశధార నది గర్భం నుంచి పెద్దఎత్తున ఇసుకను తోడేసి గ్రామ సమీపంలో భారీగా నిల్వ ఉంచుతున్నారు. పలాస, రామకృష్ణాపురం, నైర ప్రాంతాల్లో ఇసుక నిల్వలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ నదిలో తవ్వకాలకు అనుమతులు ఉండవని ముందుగానే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వివరణ అడిగితే భూగర్జగనులు, రెవెన్యూశాఖ అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని