logo

మాటిచ్చారు.. మడమ తిప్పారు..!

మాటిస్తే మడమ తిప్పనన్న ముఖ్యమంత్రి వ్యాఖ్య ఆ చిరు జీవితాల్లో అమలు జరగలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ముఖ్యమంత్రిగా పట్టించుకున్న పరిస్థితి లేదు. వినతులిచ్చినా, నిరసన తెలిపినా వారికో దారిమాత్రం దొరకలేదు.

Published : 28 Feb 2024 04:10 IST

అగమ్యగోచరంగా లైసెన్డ్స్‌ సర్వేయర్ల పరిస్థితి
నెరవేరని ముఖ్యమంత్రి హామీ
న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం  

పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న మండల సహాయ సర్వేయర్లు

మాటిస్తే మడమ తిప్పనన్న ముఖ్యమంత్రి వ్యాఖ్య ఆ చిరు జీవితాల్లో అమలు జరగలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ముఖ్యమంత్రిగా పట్టించుకున్న పరిస్థితి లేదు. వినతులిచ్చినా, నిరసన తెలిపినా వారికో దారిమాత్రం దొరకలేదు. జిల్లా వ్యాప్తంగా మండల అసిస్టెంట్‌ సర్వేయర్లుగా పనిచేస్తున్న లైసెన్స్డ్‌ సర్వేయర్లు రోడ్డున పడ్డారు. వారి కుటుంబ జీవనం భారంగా మారింది.

ప్రతి మండలంలోని సర్వేయరుకు అసిస్టెంట్‌ సర్వేయర్లుగా విధులు నిర్వహించేందుకు లైసెన్స్డ్‌ సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. 2018లో మండల స్థాయిలో మ్యుటేషన్లు, ఇతర పనులు నిర్వహించేందుకు వీరిని విధుల్లో చేర్చారు. కమీషను ప్రాతిపదికన అప్పట్లో నియమించారు. ఎన్నికల సమయంలో పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వీరి సమస్యను వివరించగా వారి భవిష్యత్తుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనను కలవగా, సచివాలయ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సచివాలయ వ్యవస్థ నియామకాలు జరిపించారు. వీరితోనే సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా ఇప్పించారు. అవసరం తీరాక వీరిని రోడ్డున పడేశారు.

రోడ్డున పడిన పరిస్థితి..

జిల్లాలో 40 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది లైసెన్స్డ్‌ సర్వేయర్లు మండల అసిస్టెంట్‌ సర్వేయర్లుగా విధులు నిర్వహించారు. గత ఎన్నికల్లో మ్యాపింగ్‌ సహా ఈవీఎం పనులు సైతం వీరే చేశారు. మ్యాప్‌ల స్కెచ్‌ల డిజిటలైజేషన్‌ పనంతా వీరితోనే జరిపించారు. ఇప్పుడు అర్ధాంతరంగా విడిచిపెట్టడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

నిలువునా మునిగాం

‘ముఖ్యమంత్రిని తాడేపల్లి కార్యాలయంలో కలసినప్పుడు సచివాలయ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పుడు మాకు నిలువ నీడలేకుండా చేశారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఎలాంటి భద్రత లేకుండా పోయింది’ అని కంచిలి మండల సహాయ సర్వేయరు  బి.సత్య వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని