logo

ఇది ‘ధర్మ’మేనా..?

సమయం లేదు మిత్రమా.. ఎన్నికల వేళ దగ్గరపడుతోంది.. దోచేయాలి.. అన్నట్లుగా ఉంది అధికార పార్టీ నేతల తీరు. జిల్లాలో వీరి ఆగడాలకు అదుపే లేకుండా పోతోంది.. ఇందుకు ఉదాహరణ గార మండలం తోణంగి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న దారుణమే..

Updated : 28 Feb 2024 06:10 IST

డీపట్టా భూమిపై అధికార పార్టీ నేతల కన్ను
కట్టబెట్టేందుకు ఆగమేఘాలపై దస్త్రాలు సిద్ధం
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం

తోణంగి రెవెన్యూ పరిధిలో భూమి ఇదే..

సమయం లేదు మిత్రమా.. ఎన్నికల వేళ దగ్గరపడుతోంది.. దోచేయాలి.. అన్నట్లుగా ఉంది అధికార పార్టీ నేతల తీరు. జిల్లాలో వీరి ఆగడాలకు అదుపే లేకుండా పోతోంది.. ఇందుకు ఉదాహరణ గార మండలం తోణంగి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న దారుణమే.. ఇక్కడ 4.30 ఎకరాల భూమి తెదేపాకు చెందిన ఓ మహిళ ఆధీనంలో ఉండేది. కానీ కొందరు వైకాపా నేతల కళ్లు ఈ భూమిపై పడ్డాయి. ఇంకేముంది జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి అండతో డీపట్టా భూమిని వైకాపా మద్దతుదారులకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

1996-97లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎవరి స్వాధీనంలో ఉన్న భూమిని వారికే పట్టాలు రూపొందించి అప్పగించేలా చర్యలు చేపట్టి 1998లో అందజేసింది. ఇందులో తోణంగి గ్రామానికి చెందిన ఓ మహిళకు సర్వే నంబరు 172/1లో డీపట్టా భూమి ఇచ్చారు. ఎప్పుడో 25 ఏళ్ల కిందట ఇచ్చిన భూమి ఇప్పుడు అనర్హులకు డీపట్టా ఇచ్చారంటూ అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు  ఫిర్యాదు చేశారు.  పరిశీలించిన అధికారులు గత నవంబరు 2న సంబంధిత పట్టాను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మండలం కావడంతో ఈ భూమి విలువ రూ.కోట్లలో పలుకుతోంది.

గ్రామసభలో వ్యతిరేకించినా..!

ఈనెల 26న తోణంగి పంచాయతీలో ఈ భూములకు సంబంధించి గ్రామసభ జరిగింది. దీనిలో ఏ1 నోటీసుపై దళితులు అభ్యంతరాన్ని లేవనెత్తారు. గ్రామానికి చెందిన 50 మందికి పైగా స్థానికులు భూములు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. అయినా దీనిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. చిత్రమేమిటంటే గ్రామసభ తీర్మానాన్ని అదేరోజు కాకుండా అంతకుముందే నిర్వహించి తీర్మానం ఆమోదించిన పత్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం.

అర్హులైన దళితులు, బీసీలు ఉన్నా..

అర్హులు ఉన్నా వారిని కాదని అధికార పార్టీకి చెందిన వారికి అప్పగించడంతో వెనుకబడిన వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలమని ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నివాసముంటున్నామని, డీపట్టా భూములు ఇప్పించాలంటూ గ్రామానికి చెందిన దళితులు రెండుసార్లు కలెక్టర్‌, జేసీకి ‘స్పందన’లో విన్నవించుకున్నారు. గతేడాది నవంబరున కలెక్టర్‌ను సంప్రదించగా ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించిన తర్వాత మంజూరు చేస్తామని ఎండార్సుమెంట్‌ ఇచ్చారు.

రద్దు చేయించి కాజేయాలని..

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని దక్కించుకునేందుకు తోణంగి పంచాయతీకి చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి నలుగురు మహిళల పేరున పట్టాలు రూపొందించి కాజేసేందుకు పావులు కదిపారు. ఇందుకు సంబంధించి అసైన్డ్‌ కమిటీ ఆమోదానికి అధికారాన్ని ఉపయోగించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ఆదేశానుసారం డీపట్టా భూములు వైకాపా మద్దతుదారులకే కట్టబెట్టేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


ఎవరికీ ఇవ్వలేదు..

తోణంగిలో భూమి ఎవరికీ ఇవ్వలేదు. గ్రామసభ జరిగినా ఇందుకు సంబంధించిన పత్రాలు మా వరకు రాలేదు. గతంలో ఉన్నవారు  భూమిని మరొకరికి  విక్రయించారని  చట్టపరంగా డీపట్టా రద్దు చేశారు. ఇప్పటివరకు ఎవరికీ మంజూరు చేయలేదు.

సీహెచ్‌.రంగయ్య, ఆర్డీవో శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని