logo

జగనన్న మాటల వంటకం..!

..అధికారంలోకి రాగానే ప్రచార యావలో భాగంగా మధ్యాహ్న భోజన పథకం పేరును జగనన్న గోరుముద్దగా మార్చేశారు. మెనూలో స్వల్ప మార్పులు చేసి.. ఏదో చేసేశామంటూ ఊదరగొట్టారు. అనంతరం రాగిజావ ఇస్తామని చెప్పి.. కొంతకాలానికి నీరుగార్చేశారు.

Updated : 13 Apr 2024 05:13 IST

గోరుముద్ద భోజనంలో నాణ్యత తీసికట్టు
తినేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు

..అధికారంలోకి రాగానే ప్రచార యావలో భాగంగా మధ్యాహ్న భోజన పథకం పేరును జగనన్న గోరుముద్దగా మార్చేశారు. మెనూలో స్వల్ప మార్పులు చేసి.. ఏదో చేసేశామంటూ ఊదరగొట్టారు. అనంతరం రాగిజావ ఇస్తామని చెప్పి.. కొంతకాలానికి నీరుగార్చేశారు. సభలు.. సమావేశాల్లో వైకాపా నాయకులు సైతం పిల్లలకు రుచికరమైన ఆహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప.. నాణ్యమైన భోజనం అందుతుందా.. లేదా.. అని పరిశీలించిన దాఖలాల్లేవు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ‘న్యూస్‌టుడే’ క్షేత్రస్థాయిలో   పరిశీలన చేయగా వెలుగు చూసిన లోపాలను గమనిస్తే చిన్నారుల విషయంలో జగన్‌ మామయ్య.. మాటలతో ఎంతలా వంట వండుతున్నారో అర్థమవుతుంది.

‘రూ.వందల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ బడుల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. రోజూ ఒకే రకంగా కాకుండా మెనూలోనూ మార్పులు చేశాం. ఖర్చు పెరుగుతున్నా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తున్నాం.’

జగనన్న గోరుముద్ద పథకం విషయమై సీఎం జగన్‌ చెప్పిన మాటలివీ..

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం), బృందం

విద్యార్థులు 372..  తినేవారు 105

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ఉన్నత పాఠశాలకు శుక్రవారం 372 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో సగం మంది కూడా మధ్యాహ్న భోజనం చేయలేదు. కేవలం 105 మంది మాత్రమే భోజనం చేశారు. వారికి మెనూ ప్రకారం వడ్డించారు. ఒంటి పూట బడులు కావడంతో ఎక్కువ మంది ఇళ్లకు వెళ్లిపోతున్నారని ప్రధానోపాధ్యాయుడు అప్పలస్వామి తెలిపారు.

లోపించిన రుచి..

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ‘అక్షయపాత్ర’ నుంచి పంపిన పప్పు ఇది. నాణ్యత అంతంతమాత్రంగానే ఉంది. ఆకుకూర పెద్దగా వేయలేదు. తాలింపులు, రుచిగా లేకపోవడంతో ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడలేదు. 543 విద్యార్థులు హాజరుకాగా.. 155 మంది మాత్రమే భోజనం చేశారు.

తినేవారి సంఖ్య తగ్గుముఖం

శ్రీకాకుళం, గార, ఆమదాలవలస మండలాలోని బడులకు ‘అక్షయపాత్ర’ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజూ ఇండెంట్‌ ప్రకారం ఆహారం పంపిస్తున్నారు. మొదట్లో విద్యార్థులు ఇష్టంగా తినేవారు.. ప్రస్తుతం నాణ్యత తగ్గడం.. రుచి లోపిస్తుండటంతో బడిలో భోజనం చేస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది. అన్నం కూడా గట్టి పడిపోతుండటంతో చాలా మంది ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారని విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.

చిక్కీలు ఎత్తేశారు..

జగనన్న గోరుముద్ద పథకం మెనూ ప్రకారం సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రతి విద్యార్థికీ భోజనంతో పాటు వేరుశనగ చిక్కీ అందజేయాలి. గుత్తేదారుకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో వాటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చాలా బడుల్లో చిక్కీలు ఇవ్వడం ఎత్తేశారు. అక్కడక్కడ ఉన్నచోట ఇచ్చారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గుడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

  • కవిటి మండలం పెద్దకర్రివానిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 192 మంది విద్యార్థులకు భోజనం తయారు చేశారు. అన్నం ముద్ద కట్టడంతో తినేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడ్డారు.

నీళ్లే నయం

నరసన్నపేట మండలం నరసింగరాయుడుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థులు సిద్ధం భోజనం చేశారు. వీరికి ఉడకబెట్టిన గుడ్లు, ఆకుకూర పప్పు వడ్డించారు. చిక్కీలు ఇవ్వలేదు. పప్పు నీళ్ల మాదిరిగా చాలా  పలచగా ఉంది.

ఈ అన్నం 436 మందికి..

న్యూస్‌టుడే, రణస్థలం: రణస్థలం మండలం జేఆర్‌పురం ఉన్నత పాఠశాలలో 543 మంది పిల్లలకు 436 మంది హాజరయ్యారు. వారందరి కోసం 65 కిలోల బియ్యం వండాలి.  కనీసం 30 కిలోలు కూడా వండలేదు. గుడ్లు కూడా 300 మాత్రమే ఉడకబెట్టారు. తోటకూర పప్పు చేశారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు బి.రమణయ్య మాట్లాడుతూ హాజరైన విద్యార్థులందరికీ సరిపడా భోజనం వండాలని వంట నిర్వాహకులకు బియ్యం, ఇతర సామగ్రి ఇస్తున్నామని తెలిపారు. కొంతమంది తినకుండా వెళ్తుండటంతో తక్కువగా వండుతున్నారని, అలా చేయొద్దని సూచిస్తామని చెప్పారు.

రసమా.. పప్పా..?

న్యూస్‌టుడే, జి.సిగడాం: జి.సిగడాం మండలం పెంట ప్రాథమికోన్నత పాఠశాలలో 151 మంది విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టారు. అందులో ఆకుకూర పప్పు రసం మాదిరిగా ఉంది. దీంతో పాటు గుడ్ల నాణ్యత బాగాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని