logo

తీరం.. తళతళ!

చెన్నై నగరానికి మణిహారంలాంటివి సముద్ర తీరాలు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇవే ప్రత్యేక ఆకర్షణ. ఈ బీచ్‌లపై గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) శ్రద్ధ పెడుతోంది.

Published : 09 Feb 2023 00:19 IST

ఉత్తమ బీచ్‌గా బెసెంట్నగర్‌
మిగతా వాటిపై జీసీసీ దృష్టి

బెసెంట్నగర్‌ తీరం విహంగవీక్షణం

ఈనాడు, చెన్నై: చెన్నై నగరానికి మణిహారంలాంటివి సముద్ర తీరాలు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇవే ప్రత్యేక ఆకర్షణ. ఈ బీచ్‌లపై గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) శ్రద్ధ పెడుతోంది. శుభ్రతే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంగా ఓ సర్వే చేయించింది. నగరంలో, వెలుపల ఉన్న పలు బీచ్‌ల నిర్వహణ తీరుపై నివేదిక తెప్పించుకుంది. పలుచోట్ల పనితీరు బాగానే ఉందని తేలింది. మరికొన్నిచోట్ల మరింత మెరుగుపడాలని తెలిసింది.

చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో శుభ్రమైన బీచ్‌ల ర్యాంకింగ్‌లను జీసీసీ ఈ మధ్యే ప్రకటించింది. మొత్తం 7 తీరాలను పరిగణనలోకి తీసుకుని వాటికి ప్రత్యేకంగా మార్కులు వేసింది. తొలిస్థానంలో బెసంట్‌నగర్‌ బీచ్‌ నిలవగా.. చివరి స్థానంలో నీలాంగరై ఉంది. శుభ్రత, చెత్తకుండీల వినియోగం, శుభ్రతాసిబ్బంది పనితీరు, యంత్రాల ఉపయోగం, మరుగుదొడ్ల నిర్వహణ, ప్లాస్టిక్‌ వ్యర్థాలపై జరిమానాల తీరు, అంతర్గత రహదారుల నిర్వాహణ తదితరాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకున్నారు. బెసెంట్‌నగర్‌ బీచ్‌ ఏకంగా 98.7  సాధించింది. మెరీనా 98.1, తిరువన్మియూరు 92.2, తిరువొత్తియూరు 91 పాయింట్లతో ఉన్నాయి.

కీలక నిర్ణయాలతో ముందుకు..

బెసంట్‌నగర్‌ బీచ్‌ నిర్వాహణలో జీసీసీ, ఇతర ఏజెన్సీలు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇక్కడ ప్రజల సహకారంతో ఈ బీచ్‌ అత్యంత శుభ్రంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ 336 దుకాణాలు ఇప్పుడు ఘనవ్యర్థ పదార్థాల్ని చక్కగా నిర్వహిస్తున్నాయి. చెత్తను పూర్తిస్థాయిలో వేరుచేసి జీసీసీ సిబ్బందికి అందిస్తున్నారు. వీటిని చెత్త పడేయని దుకాణాలుగా  గుర్తించారు. వాటిని ఆదర్శంగా చూపిస్తూ ఇతర దుకాణాలు కూడా ఇదే తరహాలో అమలు చేయాలని పిలుపునిస్తున్నారు. పరిసరాల్లో చెత్త సేకరణ బాగా జరుగుతున్నట్లు జీసీసీ ప్రకటించింది. పర్యాటకులు, ఇతర సందర్శకుల కోసం మరుగుదొడ్లను సమయానుకూలంగా శుభ్రపరుస్తున్నట్లుగా తెలిపారు. ఇసుకలో పర్యాటకులు పడేసిన చెత్తను తొలగించడానికి ప్రత్యేక యంత్రాల్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.మెరీనా బీచ్‌లో కూడా 200 దుకాణాలు ఘనవ్యర్థాల నిర్వహణకు ముందుకొచ్చాయి. ఈ బీచ్‌ శుభ్రత విషయంలో రెండోస్థానంలో నిలవడం గమనార్హం.

గతంలోనూ అంతే..

గతేడాది నగరంలోని బీచ్‌లపై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చి (ఎన్‌సీసీఆర్‌) సర్వే నిర్వహించింది. ఇందులో చాలా లోపాలు బయటపడ్డాయి. పలు బీచ్‌ల్లో ప్లాస్టిక్‌ సంచులు, నీటిసీసాలు, ఆహారపదార్థాల ప్యాకేజింగ్‌ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ కప్పులు,  స్ట్రాలు, షాంపూ ప్యాకెట్లు, సిగరెట్లు, పలురకాల తాళ్లు.. అనేకరకాల వ్యర్థాలు బయటపడ్డాయి. దీనిపై ఆ సంస్థ ప్రత్యేక నివేదిక కూడా ఇచ్చింది. ఈ మేరకు జీసీసీ కూడా ప్రత్యేక దృష్టి సారించి జరిమానా విధిస్తోంది. ప్రత్యేకించి దుకాణాదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఉత్తర చెన్నైలో...

మరిన్ని బీచ్‌ల్ని రోజువారీ పరిశుభ్రంగా ఉంచేందుకు జీసీసీ సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి వనరుల్ని సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకించి ఉత్తర చెన్నైవైపు ఉన్న బీచ్‌ల్లో పర్యాటకులకు వసతులు బాగా పెంచాల్సిన అవసరముందని గుర్తించారు. జీసీసీ ప్రస్తుతం బీచ్‌ల శుభ్రత, పూర్తిస్థాయి నిర్వహణ కోసం ప్రత్యేక బృందాల్ని నియమించింది. ఇలా ప్రస్తుతానికి 7 బీచ్‌ల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ పలు లోపాలుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వెల్లడైంది. ప్రత్యేకించి సముద్రజీవులకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీవ్ర ఆటంకంగా ఉన్నాయి. చాలావరకు వాటిబారిన పడి చనిపోయి ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాడి పడేసే ప్లాస్టిక్‌పై నిఘా పెంచారు. జీసీసీ పాలకవర్గం కూడా ఈ నేపథ్యంలో పలు కీలక చర్యలు చేపడుతోంది.

ఇప్పటికీ సమస్యలే

తిరువొత్తియూర్‌, పాలవాక్కం, నీలాంగరై, అక్కరై, తిరువొన్మియూరు బీచ్‌లో ఇప్పటికీ మౌలికవసతుల లేమి కనిపిస్తున్నట్లు సర్వేలో తేలింది. తిరువొన్మియూరు బీచ్‌లో ఇసుకపై ఉన్న వ్యర్థాల్ని తీయడానికి ఎలాంటి యంత్రాలు లేవు. దీంతో అక్కడి బీచ్‌ను అందంగా తీసుకురావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. పాలవాక్కం, అక్కరై బీచ్‌ల్లో సరిపడా శుభ్రతా సిబ్బంది లేరు. నీలాంగరై బీచ్‌లోనూ ఇలాంటి సమస్యలే వేధిస్తున్నాయి. పాలవాక్కం, నీలాంగరై, అక్కరై బీచ్‌ల్లో ఇప్పటికీ చుట్టుపక్కల ప్రజలు బహిర్భూమికి వెళ్తున్నారని, ఈ చర్యలను ఆపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయా తీరాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, బీచ్‌ల శుభ్రతకు వివిధ సంస్థలు, సామాజిక ఔత్సాహికుల్ని ఆహ్వానించాలని కోరుతున్నారు.

  శుభ్రతా పనుల్లో సిబ్బంది
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని