logo

మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్‌తో కాల్చిన తండ్రి

తంజావూర్‌ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది.

Updated : 19 Apr 2024 02:48 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తంజావూర్‌ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. మద్యానికి బానిసైన బాలసుబ్రమణ్యం పనికి వెళ్ల్లకుండ తరచూ తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యం తాగడానికి డబ్బులు లేవనే కోపంతో తన కుమార్తె చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్‌తో కాల్చి వీడియో తీసి విదేశాల్లో ఉన్న భార్యకు పంపి డబ్బులు అడిగాడు. వీడియోని చూసిన తల్లి శివరంజని తల్లడిల్లిపోయింది. వెంటనే అధిరపట్టినంలోని తనకు తెలిసిన సామాజికవేత్తకు సమాచారం ఇచ్చింది. అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని కాపాడి, బాలసుబ్రమణ్యాన్ని అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఏటీఎంలో నగదు చోరీ

ప్యారిస్‌, న్యూస్‌టుడే: చెన్నై పల్లావరం జీఎస్టీ సాలైలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం మీనంబాక్కం విమానాశ్రయం ఎదురుగా ఉంది. ఈ క్రమంలో బుధవారం ఏటీఎంలో నగదు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. ఏటీఎంలో కొంత నగదు ఉన్నట్లు వారి వద్ద సమాచారం ఉంది. కాని అక్కడికి వెళ్లిచూస్తే ఏటీఎం యంత్రంలో నగదు లేదు. దీంతో వారు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారులు వెళ్లి పరిశీలించగా ఏటీఎం సీక్రెట్‌ కోడ్‌ నెంబరు ఉపయోగించి రూ.100 తీసుకుంటే రూ.500 వచ్చేలా సెట్టింగ్‌ మార్చినట్లు గమనించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు సెట్టింగ్‌ మార్చి నగదు చోరీచేసినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


చోరీ చేయడానికొచ్చి నిద్రపోయిన దొంగ

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తక్కలైకి చెందిన మోహన్‌దాస్‌ కొన్ని రోజుల క్రితం ఇంటికి తాళం వేసి భార్యతో పాటు తూత్తుక్కుడిలోని కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు భార్యతో కలిసి సొంతూరికి వచ్చాడు. అప్పుడు ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. లోపలికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. అనంతరం స్థానికుల సాయంతో దుండగుడిని పట్టుకుని పోలీసులకి అప్పగించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా అతను తిరునెల్వేలికి చెందిన శివశంకర్‌ అని తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని