logo

పర్యాటకంపై పెరిగిన ఆసక్తి

నగరంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు.

Published : 19 Apr 2024 00:09 IST

వడపళని, న్యూస్‌టుడే: నగరంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. జూన్‌ వరకు ఎక్కువ మంది కుటుంబాలు, బృందాలుగా వెళ్లేందుకు టిక్కెట్ల కోసం విచారిస్తున్నారని ట్రావెల్‌, టూర్‌ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. మోస్తరు ఖర్చు పెట్టాలనుకునేవారు కొలంబో, బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌, దుబాయి, డబ్బుకు వెనుకాడని వారు అజెర్‌బైజన్‌, కజకిస్తాన్‌, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌వంటి దేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

ఉష్ణోగ్రతలు లెక్క చేయకుండా..

తాము వెళ్లాలనుకున్న దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నా, లేకపోయినా ప్రజలు పట్టించుకోవడం లేదు. వేసవిలో వెళ్లే ప్రదేశం కాకపోయినా ఎక్కువమంది దుబాయి ప్రయాణ వివరాలు ఆరా తీస్తున్నారు. మారిషస్‌కు టిక్కెట్‌ ధర ఎక్కువగా ఉన్నా వెళ్లేందుకు టిక్కెట్లు కొంటున్నారని మదుర ట్రావెల్స్‌ ప్రతినిధి శ్రీహరన్‌బాలన్‌ అన్నారు. వేసవిలో బుకింగ్‌ ఏటికేడు 25 శాతం పెరుగుతోంది. ఎస్‌ఓటీసీ ట్రావెల్‌ సంస్థ కంట్రీ హెడ్‌ డేనియల్‌ డి.సౌజా మాట్లాడుతూ దేశీయ ప్రయాణాలకు 20 నుంచి 30 రోజులు, అట్టే దూరాలు లేని ప్రాంతాలకు 30 నుంచి 35 రోజులు ముందుగా బుకింగులు జరుగుతున్నాయన్నారు. నటుడు తలైవాసల్‌ విజయ్‌ కుటుంబంతో కలిసి యూరప్‌ దేశాలైన ఇటలీ, హంగేరి, జెక్‌వంటి ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెప్పారు. పర్యటన గ్రూపుతో కూడిందని, యూరోపియన్లు కూడా కలుస్తారని పేర్కొన్నారు. వాతావరణం గురించి ఆలోచించడం లేదని, ఎండ బాగా ఉన్నా ఫర్వాలేదని, కొత్త ప్రదేశాలు చూడాలనే ఆలోచనలో ఉన్నామని విజయ్‌ చెప్పారు.

దేశీయంగా..

దిల్లీ- రూ.13వేల నుంచి రూ.20వేలు, శ్రీనగర్‌ రూ.24,500 నుంచి రూ.43వేలు, గోవా రూ.7,900 నుంచి రూ.26వేలు, లక్షద్వీప్‌- రూ.23,500, పోర్ట్‌ బ్లెయిర్‌ రూ.13వేల నుంచి రూ.15,800గా ఛార్జీలు ఉన్నాయి.

మే మధ్యలో వెళ్లాలంటే విమాన ఛార్జీలు ఇలా..

కొలంబో రూ.14,500 నుంచి రూ.20వేలు, కౌలాలంపూరు రూ.15వేల నుంచి రూ.20వేలు, బ్యాంకాక్‌ రూ.25 వేల నుంచి రూ.29వేలు, సింగపూర్‌ రూ.20 వేల నుంచి రూ.30 వేలు, దుబాయి రూ.25 వేల నుంచి రూ.30,800, మారిషస్‌ రూ.60వేల నుంచి రూ.66,900గా ఉంది.  

40 శాతం ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలకు..

బుకింగ్‌.కామ్‌ సైట్ ద్వారా 40శాతం మంది పర్యాటకులు ఆసియా-పసిఫిక్‌ దేశాలు, 20 శాతం మంది మిడిల్‌ ఈస్ట్‌, 40 శాతం మంది యూరప్‌, యూఎస్‌, దుబాయి, సింగపూర్‌, లండన్‌, బ్యాంకాక్‌, న్యూయార్క్‌, టోక్యో, బాలి, మక్కా, ఆమ్‌స్టర్‌డ్యాం వంటి ప్రాంతాలకు ఏప్రిల్‌, జులైలో వెళ్లడానికి బుక్‌ చేసుకుంటున్నారు. డొమెస్టిక్‌ పర్యాటకులు ఊటీ, శ్రీనగర్‌, మనలి, డార్జిలింగ్‌, గోవా, కొడైక్కెనాల్‌, పూరి, రిషికేష్‌, మున్నార్‌, ముస్సోరి వెళ్లడానికి సుముఖత చూపుతున్నారు. ప్రయాణికులు ఖర్చులకు వెనుకాడకపోవడంతో విమాన ఛార్జీలు, ఆయా ప్రాంతాల్లో హోటళ్ల అద్దెలు బాగానే పెరిగాయని బుకింగ్‌.కామ్‌ కంట్రీ మేనేజరు సంతోష్‌కుమార్‌ అన్నారు. శ్రీనగర్‌, గోవా, దిల్లీ, ఈశాన్య రాష్ట్రాల కన్నా కొలంబో, కౌలాలంపూర్‌, సింగపూర్‌ వెళితే ఆర్థికంగా కలిసొస్తుంది. బెంగళూరు నుంచి అగట్టికి రిటర్న్‌ టిక్కెట్‌ ఛార్జీ రూ.23వేలుగా ఉంది.  దాదాపు ఇదే ఛార్జి దుబాయి, కొలంబోకు కూడా వసూలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హోటల్‌ గదుల అద్దెలు నగరాల్లో 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయని డి.సౌజ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని