logo

పాదచారుల సబ్‌వే త్వరగా తెరవండి

పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్‌వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్‌వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు.

Published : 19 Apr 2024 06:57 IST

తాంబరం వాసుల డిమాండు 

మూసి ఉన్న సబ్‌వే తలుపులు

వడపళని, న్యూస్‌టుడే: పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్‌వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్‌వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది సెప్టెంబరు నుంచి తాళాలు వేశారు. స్థానికులు సబ్‌వేను మూసి ఉంచడంపై పలుమార్లు తాంబరం కార్పొరేషన్‌, ప్రధాని కార్యాలయానికి వినతులు సమర్పించినా ఎలాంటి పరిష్కారమూ కనిపించలేదు.

పాఠశాలలకు వెళ్లే వారికి..

పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వయసు పైబడిన వారు ఇక్కడి సబ్‌వే మూసి ఉండటంతో గణపతిపురం సబ్‌వే గుండా కి.మీ.కుపైగా నడిచి తూర్పు, పడమర తాంబరానికి చేరుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే లైను దాటి వెళ్తున్నారు. రూ.3.8 కోట్లతో నిర్మించిన రైల్వే సబ్‌వే తూర్పు, పడమర తాంబరానికి అనుసంధానంగా ఉంది. ప్రస్తుతం అక్కడి గేటుకు తాళం వేసి కనిపిస్తోంది. బయట ఉన్న గోడపై సబ్‌వే పబ్లిక్‌కు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అనుమతి కల్పిస్తామని, దక్షిణ రైల్వే/తాంబరం కార్పొరేషన్‌ అని పెయింట్‌తో రాసిన అక్షరాలు దర్శనమిస్తున్నాయి.

 గతంలో ఇక్కడ రైల్వే గేటు..

గతంలో ఇక్కడ లెవల్‌ క్రాసింగ్‌ గేటు ఉండేది. పట్టాలు దాటేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులందాయి. 2018లో సబ్‌వే నిర్మాణం జరిగింది. నిత్యం తిరిగే వేలాది మంది విద్యార్థులు, స్థానికులకు సబ్‌వే చాలా ఉపయోగకరంగా ఉందని, తూర్పు నుంచి పడమర తాంబరానికి వెళ్లే వారందరూ వినియోగించుకుంటున్నారని ఎప్పుడూ తెరిచి ఉంటే బాగుంటుందని ‘ఎంఈఎస్‌ రోడ్‌ గణపతిపురం వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడు కె.రమేష్‌ అన్నారు. కొందరు సంఘ విద్రోహశక్తులు విద్యుద్దీపాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.  

గతేడాది మార్చిలో సమావేశం..

కిందటి సంవత్సరం మార్చి నెలలో రైల్వే అధికారులు, పోలీసు విభాగం, కార్పొరేషన్‌ అధికారులు, మేయర్‌, రైల్వే సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. సబ్‌వే మరమ్మతులతో పాటు విద్యుద్దీపాలు కూడా అమర్చి తాంబరం కార్పొరేషన్‌కు అందించారు. అనంతరం రెండు వారాలు సబ్‌వే తెరిచి ఉంచారు. ఆ తర్వాత నిర్వహణ లోపంతో సెప్టెంబరు 1 నుంచి మూసివేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించలేదని మరో సంఘ సభ్యుడు అరుణ్‌ కుమార్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని