logo

పోలింగ్‌ శాతం తగ్గడం దేనికి సంకేతం?

రాష్ట్రంలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో 34 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Published : 22 Apr 2024 01:07 IST

పలువురు నేతల భిన్నాభిప్రాయాలు

సైదాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో 34 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏ కారణంగా ప్రజలు ఓటేసేందుకు రాలేదన్న చర్చ మొదలైంది. అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పోలింగ్‌ శాతం తగ్గడం ఎవరికి నష్టం చూకూరుస్తుందనే విషయంపై పలువురు నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

డీఎంకే ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి... డీఎంకే కూటమికి పడాల్సిన ఓట్లు యథాతథంగా పడతాయని, ఎన్నికల్లో మహిళలు ఎక్కువగా ఓటేశారన్నారు. ఇది డీఎంకేకు అనుకూలంగా చెప్పారు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్నందున డీఎంకేకు మెజారీటీ కాస్త తక్కువగా ఉంటుందని, మొత్తానికి విజయం డీఎంకేదే అన్నారు.

అన్నాడీఎంకే కోశాధికారి దిండుక్కల్‌ శీనివాసన్‌... అన్నాడీఎంకే, డీఎంకే, భాజపా కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొందని, ఇందులో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే ప్రధాన పోటీ అన్నారు. గ్రామ స్థాయి నుంచి డీఎంకే, అన్నాడీఎంకేలకు కార్యకర్తలున్నారని తెలిపారు. భాజపాకు ఆ విధంగా లేరన్నారు. కావున పోలింగ్‌ శాతం తగ్గడం భాజపాకు ఎక్కువ నష్టం చేకూరుస్తుందని, ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించదన్నారు. నామ్‌ తమిళర్‌ కట్చి నియోజకవర్గానికి 10 నుంచి 15 వేల ఓట్లు పొందుతుందని పేర్కొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌... పోలింగ్‌ శాతం తగ్గినా ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఎవరు విజయం సాధించాలనుకునేవారు తప్పకుండా ఓటేసి ఉంటారన్నారు. ఆ మేరకు డీఎంకే కూటమికి దక్కాల్సిన ఓట్లు దక్కుంటాయని తెలిపారు. భాజపా, అన్నాడీఎంకేకు విజయం సాధిస్తామనే నమ్మకం లేదన్నారు. వారి దగ్గర ఎన్నికల వ్యూహం కూడా లేదన్నారు. కావున నష్టం భాజపా, అన్నాడీఎంకేలకే అని పేర్కొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌... పోలింగ్‌ శాతం తగ్గినా గెలిచేది డీఎంకే కూటమేనని, పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని