logo

ప్రముఖ వేద పండితుడు రోహిణీ కుమార్‌ శాస్త్రి కన్నుమూత

ప్రముఖ వేద పండితుడు, పురోహితుడు తాండ్ర రోహిణీకుమార్‌ శాస్త్రి (68) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. శనివారం ఉదయం నిద్రలేవకపోవడంతో కుటుంబీకులు వైద్యులను పిలిపించారు.

Published : 22 Apr 2024 01:16 IST

రోహిణీకుమార్‌ శాస్త్రి భౌతికకాయం వద్ద కుటుంబీకులు

వడపళని, న్యూస్‌టుడే: ప్రముఖ వేద పండితుడు, పురోహితుడు తాండ్ర రోహిణీకుమార్‌ శాస్త్రి (68) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. శనివారం ఉదయం నిద్రలేవకపోవడంతో కుటుంబీకులు వైద్యులను పిలిపించారు. వారు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. శాస్త్రి నగరంలోని పలు తెలుగు సంఘాలు, తెలుగు వారికి సుపరిచితుడు. చెన్నైలో (అప్పటి మద్రాసు) తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల్లో ఈయన, అన్నయ్య అశ్వనీ కుమార్‌ శాస్త్రి పాటల రికార్డింగు, కొత్త సినిమా షూటింగులకు ముహూర్తాలు నిర్ణయించే వారు. ఈ సోదరులు నిర్ధారించే ముహూర్తాల సమయంలో సినిమాలు తీస్తే బాగా విజయవంతమవుతాయనే నమ్మకం పలువురు నిర్మాతల్లో ఉండేది. వీరి తండ్రి తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన వృత్తి రీత్యా వేదపండితుడు, పురోహితుడు. ఈ ఇద్దరు సోదరులు డిగ్రీలు చదివిన తర్వాత తండ్రి బాటలోనే సాగారు. వారు పెట్టే ముహూర్తాల సమయంలో సినిమాలు తీస్తే బాగా విజయవంతమవుతాయనే నమ్మకం పలువురు నిర్మాతల్లో ఉండేది. ఒక్క తెలుగు సినిమా రంగానికే కాకుండా పలు తమిళ చిత్రాల నిర్మాతలకు కూడా ఈ ఇద్దరు బాగా పరిచయమున్నవారే. తమిళనాడు ప్రభుత్వం తరఫున జరిగే పెద్ద కార్యక్రమాలకు పూజల్లో పాల్గొనేవారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు, అన్న అశ్వనీ శాస్త్రి ఆదివారం రాత్రి చెన్నైకి చేరుకోనున్నారని కుటుంబీకులు తెలిపారు. మూడో కుమార్తె చెన్నైలోనే ఉంటున్నారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రభుత్వం తరఫున జయలలిత ఆధ్వర్యంలో జరిగిన ఓ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వనీ శాస్త్రి, రోహిణీ శాస్త్రి

 

దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి దంపతులు, ఇతర మంత్రుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో..

 

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూలమాలతో సత్కరిస్తున్న సోదరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని