logo

దేశాన్ని కాషాయమయం చేసేందుకు భాజపా కుట్ర

దేశమంతా కాషాయమయం చేసేందుకు భాజపా కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో...

Published : 22 Apr 2024 01:32 IST

సీఎం స్టాలిన్‌

స్టాలిన్‌కు శాలువా కప్పుతున్న వైగో, పక్కన దురై వైగో

సైదాపేట, న్యూస్‌టుడే: దేశమంతా కాషాయమయం చేసేందుకు భాజపా కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ప్రసార భారతి తన హిందీ న్యూస్‌ ఛానల్‌ దూరదర్శన్‌ లోగోను ఎరుపు నుంచి కాషాయ రంగుకు మార్చిందని తెలిపారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో తమ పార్టీ రంగు అయిన కాషాయ రంగును ఇనువడింపజేస్తుందని ముందే ప్రతిపక్షాలు తెలిపాయన్నారు. ప్రపంచ రహస్యం చెప్పిన వళ్లువర్‌కు కాషాయ రంగు పూశారని, అలాగే తమిళనాడుకు చెందిన నేతల విగ్రహాలపై కాషాయ పెయింట్‌ పోసి అవమానించారని పేర్కొన్నారు. వానొలి అనే స్వచ్ఛమైన తమిళ పేరును ఆకాశవాణి అని సంస్కృతానికి మార్చారని ఆరోపించారు. అలాగే పొదిగై అనే అందమైన తమిళ పదాన్ని తొలగించారని చెప్పారు. ప్రస్తుతం దూరదర్శన్‌ లోగును కూడా కాషాయమయం చేశారని మండిపడ్డారు. వీటన్నింటికీ బదులిచ్చే విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని తెలిపారు.

ముఖ్యమంత్రితో పలువురి భేటీ

సైదాపేట: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో పలు పార్టీల నేతలు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆదివారం సచివాలయంలో కలిశారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, ముఖ్య కార్యదర్శి దురై వైగో, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌, ఉన్నత స్థాయి బృంద సభ్యుడు రామకృష్ణన్‌, మంత్రులు కేఎన్‌ నెహ్రూ, టీఆర్‌బీ రాజా, గీతా జీవన్‌, సీవీ గణేశన్‌, రఘుపతి, పెరియకరుప్పన్‌, లోక్‌సభ అభ్యర్థులు ఎ.రాజా, అరుణ్‌ నెహ్రూ, దిండుక్కల్‌ లియోని, దక్షిణ చెన్నై డీఎంకే అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్‌ తదితరులు కలిసి సత్కరించారు.

ఆర్కాడు వీరాసామికి జన్మదిన శుభాకాంక్షలు

సైదాపేట: డీఎంకే కార్యవర్గ కమిటీ సభ్యుడు, సీనియర్‌ నేత ఆర్కాడు వీరాసామి 88వ పుట్టినరోజు వేడుకలు ఆయన గృహంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. చెన్నై అన్నానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం స్టాలిన్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెంట మంత్రులు కేఎన్‌ నెహ్రూ, టీఆర్‌బీ రాజా, ఉత్తర చెన్నై లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కళానిధి వీరాసామి, ఎమ్మెల్యే మోహన్‌, చెన్నై పశ్చిమ జిల్లా కార్యదర్శి చిట్రరసు తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రిలో మంత్రులు సీవీ గణేశన్‌, కేఎన్‌ నెహ్రూ తదితరులు

 

సీపీఎం నేతలు బాలకృష్ణన్‌, రామకృష్ణన్‌ తదితరులు

 

వీరాసామికి శుభాకాంక్షలు తెలుపుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని