logo

రాష్ట్ర అధికారుల సాయంతో డీఎంకే కుట్ర

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర అధికారుల సాయంతో డీఎంకే చేసిన కుట్ర బట్టబయలు అయిందని, మళ్లీ ఎన్నికలు జరపాలని భాజపా డిమాండ్‌ చేసింది.

Published : 22 Apr 2024 01:35 IST

భాజపా ఆరోపణ
రీపోలింగ్‌కు డిమాండ్‌

చెన్నై మాధవరంలోని నాగకన్నిక అమ్మన్‌ ఆలయంలో ఆదివారం జరిగిన కుంభాభిషేకంలో
పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌.రవి దంపతులు

సైదాపేట, న్యూస్‌టుడే


సైదాపేట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర అధికారుల సాయంతో డీఎంకే చేసిన కుట్ర బట్టబయలు అయిందని, మళ్లీ ఎన్నికలు జరపాలని భాజపా డిమాండ్‌ చేసింది. దీని గురించి ఆదివారం తమిళనాడు భాజపా ప్రచారకర్త ఏఎన్‌ఎస్‌ ప్రసాద్‌ విడుదల చేసిన ప్రకటనలో... లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల కమిషన్‌ అయినా విధులు నిర్వహించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులేనని తెలిపారు. తమిళనాడుకు సంబంధించినంత వరకు ఓటరు జాబితా తయారీ, సరిచూడటం, చివరి జాబితా విడుదల, నామినేషన్‌ దాఖలు, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు నిర్వహించేది తమిళనాడు అధికారులు, జిల్లా కలెక్టర్లేనని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా పని చేశారన్నారు. వీరంతా పూర్తిగా డీఎంకే నియంత్రణలో ఉన్నారని ఆరోపించారు. కోయంబత్తూరు తదితర నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందే ప్రణాళిక ప్రకారం తమకు కావల్సిన అధికారులను జిల్లా కలెక్టర్లుగా డీఎంకే ప్రభుత్వం నియమించిందన్నారు. దీంతో తమిళనాడులో నిజాయతీగా ఎన్నికలు జరగలేదన్నారు. పోలింగ్‌ శాతం ప్రకటనలో ఏర్పడిన గందరగోళంతో ఇది తెలుస్తోందన్నారు. తమకు అనుకూలమైన అధికారుల ద్వారా తమిళనాడులో ఉండే 39 నియోజకవర్గాల్లో భాజపాకు ఓటేసే ఉత్తర భారతీయులు, ప్రత్యేక సామాజికవర్గాల ప్రజల ఓట్లను జాబితా నుంచి చివరి క్షణంలో తొలగించారన్నారు. ముఖ్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌, మాజీ గవర్నర్‌ తమిళిసై, ఏపీ మురుగానందం, పాల్‌ కనకరాజ్‌, వినోజ్‌ పి.సెల్వం తదితర భాజపా ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తలా లక్ష ఓట్ల చొప్పున తొలగించారని ఆరోపించారు. డీఎంకే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పనులను అన్నామలై పోలింగ్‌ రోజే తేటతెల్లం చేశారని తెలిపారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన వారిని జాబితాలో చేర్చి మళ్లీ పోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని