logo

ఓటేయాలంటే వెగటెందుకు?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి, రాజకీయ నేతల ఆటలు కట్టించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు ఓటు.

Published : 22 Apr 2024 01:39 IST

35 పార్లమెంటు స్థానాల్లో తగ్గిన పోలింగ్‌
20 చోట్ల మూడు దఫాలుగా జనాల నిరాసక్తత
28 అసెంబ్లీ స్థానాల్లో సుమారు సగం మంది ఓటుకు దూరం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి, రాజకీయ నేతల ఆటలు కట్టించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు ఓటు. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరంగా ఉంటున్న వైనం తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. 39 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు జరిగితే ఏకంగా 35 చోట్ల గత ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతం తగ్గిందీ అంటే.. ఆసక్తి ఏమేర ఉందో అర్థమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ సరళి, ఓటింగ్‌ శాతాలపై మరింత లోతుగా విశ్లేషించుచుంటే మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. అవేంటో చూసేద్దాం..

ఈనాడు-చెన్నై

 


ధర్మపురే టాప్‌

అత్యధికత పోలింగ్‌ శాతాలతో నిలిచిన ఏకైక పార్లమెంటు స్థానం.. ధర్మపురి. ఇక్కడ గత 3 దఫాలుగా వరసగా 81.14, 82.42, 81.20 శాతాలు నమోదవుతూ వచ్చాయి. ఈ మూడుసార్లూ ఈ నియోజకవర్గమే టాప్‌లో ఉంది. ఇక్కడి ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన, గౌరవం ఉందని చెప్పడానికి ఈ శాతాలే ఉదాహరణగా ఉన్నాయి.


గత ఎన్నికల్లో మంచి పోలింగ్‌ శాతం నమోదై, ఈ ఎన్నికల్లో కాస్త తగ్గితే.. ఏదో మళ్లీ ప్రయత్నిస్తే మారతారులే అనుకోవచ్చు. కానీ గత మూడు దఫాలుగా పోలింగ్‌ శాతాలు పడిపోతుంటే ఏమనాలి?. గత మూడు, నాలుగు లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే.. దారుణంగా పోలింగ్‌ శాతం తగ్గుతున్న స్థానాలు 20 ఉన్నాయి. అన్నింటిలోనూ మధ్య చెన్నై ముందుంది. ఈ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్‌ శాతం (53.96) ఇక్కడే నమోదైంది. ప్రత్యేకించి గత మూడు దఫాలుగా పోలింగ్‌ శాతాలు క్రమంగా తగ్గుతున్న పార్లమెంటు స్థానాలను చూస్తే.. తిరువళ్లూరు, దక్షిణ చెన్నై, కాంచీపురం, తిరువణ్ణామలై, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పొళ్లాచ్చి, దిండుక్కల్‌, కరూర్‌, పెరంబలూర్‌, కడలూర్‌, చిదంబరం, మయిలాడుదురై, నాగపట్టిణం, తంజావూర్‌, శివగంగై, విరుదునగర్‌, మదురై, తెన్‌కాశి, తిరునెల్వేలి ఉన్నాయి. 2009 నుంచి 2024 వరకు నాలుగు లోక్‌సభ ఎన్నికల్లోనూ వరసగా పోలింగ్‌ శాతాలు తగ్గుతూ వస్తున్న స్థానాలు చూసుకుంటే.. ఈ జాబితాలో మదురై, విరుదునగర్‌, తంజావూర్‌, కరూర్‌, పొళ్లాచ్చి స్థానాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. 80 శాతానికి తగ్గకుండా వచ్చే కరూర్‌ లాంటి చోట కూడా ఈసారి 78.90గా నమోదైంది.

ఎన్నడూలేనంత కనిష్ఠం

గత నాలుగు ఎన్నికలను చూస్తే.. కళ్లకురిచ్చి, సేలం నియోజకవర్గాలు క్రమంగా ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంటూ తమ సత్తా చాటుతున్నాయి. కానీ ఇందుకు విరుద్ధంగా ఏకంగా 31 నియోజకవర్గాల్లో గత నాలుగుసార్లు ఎప్పుడూలేనంతగా కనిష్ఠ పోలింగ్‌ నమోదైంది. ఎన్నికల కమిషన్‌ అధికారులను సైతం అక్కడి గణాంకాలు విస్మయానికి గురిచేశాయి. అలాంటి ఆశ్చర్యకర నియోజకవర్గాల జాబితాలో తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాథపురం, విరుదునగర్‌, తేని, మదురై, నాగపట్టిణం, శివగంగై, తంజావూర్‌, మయిలాడుదురై, చిదంబరం, కడలూర్‌, పెరంబలూర్‌, కరూర్‌, దిండుక్కల్‌, పొళ్లాచ్చి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, నామక్కల్‌, విళుపురం, ఆరణి, తిరువణ్ణామలై, కృష్ణగిరి, అరక్కోణం, కాంచీపురం, శ్రీపెరుంబుదూర్‌, మధ్య చెన్నై, దక్షిణ చెన్నై, ఉత్తర చెన్నై, తిరువళ్లూర్‌ ఉన్నాయి.

మహానగరంలో మందగమనం

రాష్ట్రంలో పరిస్థితులు ఒక ఎత్తు. చెన్నై మహానగరంలో పరిస్థితులు ఒక ఎత్తు. ఇక్కడి ఉత్తర, దక్షిణ, మధ్య చెన్నై పార్లమెంటు స్థానాల్లో ఓటు బలహీనపడుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో కనిపిస్తోంది. పోలింగ్‌ కేంద్రాలు చాలావరకు ఓటర్లు పెద్దగా లేక వెలవెలబోయాయి. సుమారు సగం మంది ఎన్నికలను పెద్దగా పట్టించుకోనట్లుగా ఇక్కడ అర్థమవుతోంది.

60 దాటలేకపోయాయి మరి!

ఎన్నికల కమిషన్‌ తాజాగా విడుదల చేసిన సవరణ పోలింగ్‌ శాతాల్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాల్లో కనీసం 70 శాతం, దక్షిణ చెన్నై, మధ్య చెన్నైలో 55 శాతం దాటలేదు. మరీ విచిత్రంగా 28 అసెంబ్లీ నిమోజకవర్గాల్లో 60 శాతం దాటనేలేదు. థౌజండ్‌లైట్స్‌ అసెంబ్లీలో అత్యల్పంగా 52.40 శాతం రికార్డయింది. కోయంబత్తూరులోనూ ఓటర్లు విముఖత చూపారు. నగరంలోని ఉత్తర, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 58.77, 59.24 శాతాలు మాత్రమే నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని