logo

మరింతమందికి మగళిర్‌ ఉరిమై

అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.వెయ్యి అందించే ‘కలైజ్ఞర్‌ మగళిర్‌ ఉరిమై’ పథకంలో మరికొంతమంది లబ్ధిదారులను చేర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో జూన్‌ 4 తర్వాత కొత్తగా లబ్ధిదారుల చేర్పు పనులు చేపట్టనుందని సమాచారం.

Published : 21 May 2024 01:37 IST

జూన్‌లో కొత్త లబ్ధిదారుల చేర్పు
సన్నాహాలు చేపట్టిన ప్రభుత్వం

చెన్నై, న్యూస్‌టుడే: అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.వెయ్యి అందించే ‘కలైజ్ఞర్‌ మగళిర్‌ ఉరిమై’ పథకంలో మరికొంతమంది లబ్ధిదారులను చేర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో జూన్‌ 4 తర్వాత కొత్తగా లబ్ధిదారుల చేర్పు పనులు చేపట్టనుందని సమాచారం. కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతినెలా రూ.వెయ్యి అందించే ‘కలైజ్ఞర్‌ మగళిర్‌ ఉరిమై’ పథకాన్ని గత సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. 2021 శాసనసభ ఎన్నికల హామీలల్లో భాగంగా దీనిని డీఎంకే సర్కారు నెరవేర్చింది. ఈ పథకం కింద లబ్దిపొందేందుకు పలు అర్హతలు పేర్కొంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు లేక ఆదాయపన్ను చెల్లించే మహిళలు లబ్ధి పొందలేరని, ఆదాయపన్ను చెల్లించే లేక జీఎస్టీ దాఖలు చేసే వ్యక్తుల భార్యలు అనర్హులని, సొంతగా వాహనాలు కలిగినవారూ లబ్ధి పొందలేరని నిబంధనలు సూచించింది. ప్రారంభంలో 1.06 కోట్ల మందిని ఎంపిక చేయగా తర్వాత ఈ సంఖ్య సుమారు 1.7 కోట్లకు చేరింది.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక..

లబ్ధిదారులకు విధించిన నిబంధనలను చాలా వరకు ప్రభుత్వం సడలించనుందనే ప్రచారం జరుగుతోంది. మాజీ ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు, కార్పొరేషన్‌ మాజీ ఉద్యోగుల భార్యలకు పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. పథకం విస్తరణలో భాగంగా కొత్తగా 2.30 లక్షల మంది లబ్ధిదారులుగా చేరే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత రేషన్‌కార్డు పొందిన మహిళలు, కొత్తగా వివాహమైన మహిళలూ లబ్ధిదారులుగా చేరనున్నారు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త లబ్దిదారుల చేర్పునకు జాబితా సిద్ధం కానుందని సమాచారం. ఈ పనులకు కనిష్ఠంగా రెండు వారాలు అవసరం కావడంతో కొత్త లబ్ధిదారులకు జూన్‌లో నగదు అందే అవకాశం లేదని, జులై నుంచి అందనుందని తెలుస్తోంది. 

పునరావాస శిబిరాల్లోనివారికి.. 

మహిళల్లో విశేష స్పందన లభించడంతో పథకంలోని కొన్ని నిబంధనలు సడలించాలనే డిమాండ్లు వినిపించాయి. పునరావాస శిబిరాల్లోని మహిళలకూ ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరిస్తూ సంబంధిత జీవో విడుదల చేసింది. ఆ మేరకు 105 పునరావాస శిబిరాలకు చెందిన మహిళలకు పథకాన్ని విస్తరించారు. తద్వారా 19,487 మంది అదనంగా లబ్ధిపొందుతున్నారు. పథకంలో మరికొందరిని లబ్ధిదారులను చేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఆ పనులు పక్కన పెట్టింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని