logo

పునరుత్పాదక విద్యుత్తులో మూడో ర్యాంకు

రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్‌ ఎనర్జీ) 22,161 మెగావాట్లకు చేరుకుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్‌లుండగా తమిళనాడు మూడో ర్యాంకులో ఉందని వెల్లడైంది.

Published : 21 May 2024 01:48 IST

22 వేల మెగావాట్లు దాటిన ఉత్పత్తి

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్‌ ఎనర్జీ) 22,161 మెగావాట్లకు చేరుకుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్‌లుండగా తమిళనాడు మూడో ర్యాంకులో ఉందని వెల్లడైంది. సౌర విద్యుత్తు ద్వారా 7,516 మెగావాట్లు, డాబాల పైన(రూఫ్‌ టాప్‌) సౌర ప్లాంట్‌ల నుంచి 599 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. పంట భూముల్లో సౌరప్లాంట్ల ఏర్పాటు చేసుకోవడంలో రైతుల నుంచి సుముఖత కనిపించడంలేదు. ఇప్పటివరకు 66 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే పంట భూముల నుంచి ఉత్పత్తి కాగా, మొత్తం సౌర విద్యుత్తు ద్వారా 8,211 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతోంది.

వర్షాకాలంలో.. 

  • పర్యావరణ కాలుష్యం, భూతాపం తగ్గించుకోవడానికి కేంద్రం పునరుత్పాదక ఇంధన వనరులకే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని థర్మల్‌ ప్లాంట్లు 4,320 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నట్టు గత ఏడాది విద్యుత్తు శాఖ మంత్రి వి.సెంథిల్‌ బాలాజీ సమర్పించిన నివేదకలో తెలిసింది. 34,706 మెగావాట్ల సామర్థ్యంలో 16,417 మెగావాట్లు సంప్రదాయ వనరుల మూలంగా సమకూర్చుకోగా, పునరుత్పాదక ఉత్పత్తి ద్వారా 18,288 మెగావాట్లు అందుతోంది. మొత్తం ఉత్పత్తి అయ్యే 34,706 మెగావాట్లలో సంప్రదాయ వనరుల ద్వారా వచ్చే విద్యుత్తు 50శాతం వరకు ఉంటోంది. పవన విద్యుత్తు ఏడాది పొడవునా నిలకడగా ఉండదు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాల సమయంలో కాస్త ఎక్కువగా ఉంటూ మిగిలిన సీజన్లలో తక్కువగా ఉంటుంది. 
  • పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి సెప్టెంబరు మాసంలో బాగా ఉన్నా, థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఉత్పత్తి తగ్గి వాయు కాలుష్యం తగ్గుతుంది. కోయంబత్తూరు, దిండిగల్లు, ఉడుమలై, తేని, తిరునెల్వేలి, కన్నియాకుమారి, తిరుచెందూరులో ప్రైవేటు సంస్థలు పవన విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా ఉత్పత్తి అయిన వివరాలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనుంది.

రాష్ట్ర వాటా 11.66 శాతం

దేశంలో మొత్తం సంస్థాపన సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్తు 45,886 మెగావాట్లుగా ఉంది. సౌర విద్యుత్తు ద్వారా దేశంలో 81,813 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఏడాదిలో ఎక్కువ కాలం ఉష్ణోగ్రతలు బాగా ఉండటంతో సౌర విద్యుత్తు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. సౌర విద్యుత్తు కన్నా హైడ్రో విద్యుత్తు ఉత్పత్తి 51,931 మెగావాట్ల వరకు ఉంటోంది. దేశంలోని చక్కెర మిల్లులు 10,941 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. దేశం మొత్తంపై పునరుత్పాదక విద్యుత్తు 1.9 లక్షల మెగావాట్లుగా ఉంది. ఇందులో తమిళనాడు వాటా 11.66 శాతంగా ఉండటం గమనార్హం. 


హైడ్రో ప్రాజెక్టులు..

హైడ్రో ప్రాజెక్టుల ద్వారా 2,301 మెగావాట్ల ఉత్పత్తి అవుతుండగా, మొత్తం పునరుత్పాదక శక్తి సంస్థాపన సామర్థ్యంతో 22,181 మెగావాట్ల మేరకు ఉత్పత్తి అవుతోంది. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో అన్ని రాష్ట్రాలకన్నా గుజరాత్‌ 27,462 మెగావాట్లతో మొదటి ర్యాంకు, 27,103 మెగావాట్లతో రాజస్థాన్‌ రెండో ర్యాంకులో ఉన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని