logo

మేకపోతు రక్తం తాగిన పూజారి మృతి

ఈరోడ్‌ జిల్లా గోపిచెట్టిపాలయం సమీపం నల్లగౌండంపాలయానికి చెందిన పళనిసామి (56) కౌలప్పలూర్‌ చెట్టిపాలయంలోని అన్నామలైయార్‌ ఆలయంలో పూజారి.

Published : 24 May 2024 01:07 IST

పళనిసామి (పాతచిత్రం)

విల్లివాక్కం : ఈరోడ్‌ జిల్లా గోపిచెట్టిపాలయం సమీపం నల్లగౌండంపాలయానికి చెందిన పళనిసామి (56) కౌలప్పలూర్‌ చెట్టిపాలయంలోని అన్నామలైయార్‌ ఆలయంలో పూజారి. ప్రస్తుతం అన్నామలైయార్‌ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మేకపోతు వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి పళనిసామి సహా ఐదుగురు పూజారులు మేకపోతు రక్తంలో అరటి పండు కలుపుకుని తాగారు. తాగిన కాసేపటికి పళనిసామి వాంతులు చేసుకొని స్పృహకోల్పోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


ఫేస్‌బుక్‌లో లింక్‌ పంపి నగదు మోసం

ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన 

ప్యారిస్‌ : చెన్నై ఆదంబాక్కంకి చెందిన వినోద్‌ కార్మికుడు. ఆయన భార్య రంజిని ఓ పాఠశాలలో పని చేస్తోంది. వినోద్‌ తన మొబైల్‌ ఫోన్‌లో ఫేస్‌బుక్‌యాప్‌ చూస్తుండగా అందులో రూ.500 నోటు తాకితే రూ.5 వేలు క్యాష్‌బ్యాక్‌ పొందండి అనే ప్రకటన కనిపించింది. అతను ఆ లింక్‌ క్లిక్‌ చేశాడు. వెంటనే బ్యాంకు ఖాతాకు రూ.5 వేలు జమవుతుందని ఎస్‌ఎమ్‌ఎస్‌ వచ్చింది. వెంటనే అతను ఆనందంలో తన భార్య బ్యాంకు ఖాతాలో నగదు సరిచూడగా అందులో ఉన్న రూ.4650 మరో బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు తెలిసింది. మోసపోయినట్లు తెలుసుకుని, ఆదంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు లావాదేవీలకు వినోద్‌ ఆయన భార్య ఖాతాను ఉపయోగిస్తుంటాడు.


అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

మృతులు ఐదుగురిలో పసిపాప

ప్యారిస్, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన విరుదునగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపం తిరుత్తంగల్‌ బాలాజీ నగర్‌కి చెందిన లింగం (45), పళనియమ్మాళ్‌ (43) భార్యాభర్తలు. వీరికి కుమార్తె ఆనందవళ్లి (28), కుమారుడు ఆదిత్య (13) ఉన్నారు. లింగం, పళనియమ్మాళ్‌ ఉపాధ్యాయులు. ఆనందవళ్లికి వివాహమై శశికా అనే మూడు నెలల పాప ఉంది. ఆనందవళ్లి ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎంతసేపయినా వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా కుటుంబీకులంతా విగతజీవులుగా కనిపించారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దర్యాప్తులో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని