logo

కవిన్‌కు జోడీగా నయనతార?

దర్శకుడు నెల్సన్‌ నిర్మిస్తున్న ‘బ్లడి బగర్‌’, అరుణ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఊర్‌ కురివి’ చిత్రాల్లో కవిన్‌ నటిస్తున్నారు.

Published : 24 May 2024 01:12 IST

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు నెల్సన్‌ నిర్మిస్తున్న ‘బ్లడి బగర్‌’, అరుణ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఊర్‌ కురివి’ చిత్రాల్లో కవిన్‌ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘7 స్క్రీన్‌ స్టూడియో’ నిర్మిస్తున్న ఓ చిత్రంలోనూ కవిన్‌ హీరోగా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రంలో ఆయనకు జోడీగా నయనతార నటించనున్నట్టు కోలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రానికి మాటలు రచయిత, గేయ రచయిత విష్ణు ఏదావన్‌ దర్శకత్వం వహించనున్నారనీ తెలిసింది.


రాయన్‌ రెండో సింగిల్‌ విడుదల నేడు

చెన్నై: ధనుష్‌ 50వ చిత్రంగా ‘రాయన్‌’ రూపొందుతున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధనుష్‌ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఏ.ఆర్‌.రహమాన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం తొలి సింగిల్‌ ఇటీవల విడుదలై శ్రోతల ఆదరణాభిమానాలు పొందింది. ఈ నేపథ్యంలో రెండో సింగిల్‌ శుక్రవారం విడుదల కానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టరులో సందీప్‌ కిషన్, అపర్ణ బాలమురళీ సైకిల్‌పై వెళ్లే దృశ్యం ఆకట్టుకుంటోంది.


పిళ్లైయార్‌ సుళి చిత్రీకరణ పూర్తి

చెన్నై: మనోగరన్‌ పెరియతంబి దర్శకత్వం వహించిన ‘పిళ్లైయార్‌ సుళి’ చిత్రంలో ధీరజ్, అభినయ హీరోహీరోయిన్లుగా నటించారు. రేవతి, మైమ్‌ గోపి, మాథ్యూ వర్గీస్, పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్, దర్శన్, జీవా రవి, పళని దేవి, ఆర్జే మహాలక్ష్మి తదితరులు ఇతర తారాగణం. ఓ దివ్యాంగ చిన్నారి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు వెల్లడించారు. చిత్రీకరణ పనులు ముగిసి తుదిదశ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రం న్యూయార్క్‌ చిత్రోత్సవాల్లో ఇటీవల ఆఖరి రౌండ్‌కు ఎంపికకావడం గమనార్హం.


అరణ్మనై-4 వసూళ్ల రికార్డు

చెన్నై: సుందర్‌.సి దర్శకత్వంలో ‘అరణ్మనై-4’ మే 3న విడుదలైన విషయం తెలిసిందే. తొలి మూడు భాగాలు తరహాలోనే ఈ చిత్రంలోనూ సుందర్‌.సి నటించారు. తమన్నా, రాశి కన్నా, యోగిబాబు, కోవై సరళ, వీటీవీ గణేశ్‌ తదితరులు ఇతర నటీనటులు. మిగతా మూడు చిత్రాల కన్నా ఈ సినిమాలో గ్రాఫిక్స్, విఎఫెక్స్‌ దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు భాషల్లో, ప్రపంచ స్థాయిలో విడుదలైంది. చిత్రం విడుదలై 19 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో వసూళ్ల పరంగా ‘అరణ్మనై-4’ తొలిస్థానంలో ఉంది. రాష్ట్రంలో విడుదలైన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ వసూళ్ల రికార్డునూ అధిగమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని