logo

కమల్‌ పార్టీ కనుమరుగయ్యేనా?

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తానని హామీ ఇస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కమల్‌హాసన్‌.

Published : 24 May 2024 01:17 IST

గాడి తప్పిన సిద్ధాంతాలు
అసంతృప్తిలో నిర్వాహకులు
భవిష్యత్తు లేదంటున్న నిపుణులు
న్యూస్‌టుడే, సైదాపేట

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తానని హామీ ఇస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కమల్‌హాసన్‌. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా 2018లో ఎంఎన్‌ఎం (మక్కల్‌ నీతి మయ్యం) పార్టీ స్థాపించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తానని పార్టీ ప్రారంభించిన కొత్తలో పదేపదే చెబుతూ వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. విజయం సాధించికపోయినా మొదటి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లు ఎంఎన్‌ఎం పొందింది. తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కొన్ని పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి 142 స్థానాల్లో పోటీ చేసింది. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కమల్‌హాసన్‌ పోటీ చేశారు. అక్కడ ఎక్కువ ఓట్లు పొందిన ఆయన భాజపా అభ్యర్థి వానతీ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రెండు ఎన్నికల్లో కూడా కమల్‌ ఎన్నికల ప్రచారం డీఎంకే, అన్నాడీఎంకేలను తీవ్రంగా విమర్శిస్తూ సాగింది. అందుకు సంబంధించి వీడియోలను కూడా విడుదల చేసి కమల్‌ అప్పట్లో ప్రచారం చేశారు. అందులో కమల్‌హాసన్‌ కోపంలో టీవీని పగులకొట్టే దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నికల రంగంలో ఆవేశంగా కనిపించిన కమల్‌ వరుసగా ఒంటిరిగానే పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు.

చివరికి అదే పరిస్థితి

అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ డీఎంకే- కాంగ్రెస్‌ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఆయనకు ఆ కూటమిలో స్థానం దక్కింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. ఒక రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే తరఫున హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కమల్‌ ఎంపీగా దిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనికి కొనసాగింపుగా 2026 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాలు పొంది డీఎంకే కూటమిలోనే కొనసాగాలని ఎంఎన్‌ఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్పు వైపు ప్రయాణించిన ఎంఎన్‌ఎం ప్రస్తుతం దిశ మారి ప్రయాణిస్తోంది. దీంతో ఎంఎన్‌ఎం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే మినహా మిగతా అన్ని పార్టీలు ఈ రెండు పార్టీల భుజాన ఎక్కి పయనించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒంటరిగా పోటీ చేసే ఏ పార్టీ విజయం సాధించడం కుదరదనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఎండీఎంకే, వీసీకే తదితర పలు పార్టీలు దీనికి ఉదాహరణ. ఎంఎన్‌ఎం కూడా భవిష్యత్తులో ఈ పార్టీల వరుసలో చేరుతుందనడంలో సందేహం లేదు.

2026 సీట్లపై చర్చ

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆలోచనా సమావేశాలు జరిపేందుకు కమల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీఎంకే కూటమి తరఫున రాజ్యసభకు వెళ్లినట్లయితే డీఎంకే కూటమిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో డీఎంకే తరఫున ఇచ్చే నియోజకవర్గాలు పొంది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీఎంకే కూటమిలో కొనసాగాల్సి వస్తుంది. మార్పు కోసం ఎంఎన్‌ఎంలో చేరిన ఆ పార్టీ నిర్వాహకులకు ఇది పెద్ద నిరాశే. రెండు ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమల్‌ పార్టీని బలోపేతం చేస్తారని భావించగా ఆయన కూడా కూటమి రాజకీయాలకు పరిమితం అయ్యారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎంఎన్‌ఎం కూటమిలోకి వెళ్లినందున కూటమికి నేతృత్వం వహించే పార్టీ చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌ ఎన్ని సీట్లు పొందుతారనే ప్రశ్న ఇప్పటి నుంచే మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని