logo

కార్తి చిత్రానికి మెయ్యళగన్‌ టైటిల్‌ ఖరారు

నటుడు కార్తి 27వ చిత్రం సూర్య-జ్యోతికకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైంది. చిత్రంలో అరవింద్‌స్వామి ముఖ్యపాత్రలో నటించారు. శ్రీదివ్య, రాజ్‌కిరణ్‌ తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

Published : 26 May 2024 02:51 IST

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు కార్తి 27వ చిత్రం సూర్య-జ్యోతికకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైంది. చిత్రంలో అరవింద్‌స్వామి ముఖ్యపాత్రలో నటించారు. శ్రీదివ్య, రాజ్‌కిరణ్‌ తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం చిత్రీకరణ పనులు పూర్తయినట్టు చిత్రబృందం ప్రకటించింది. చిత్రానికి ‘మెయ్యళగన్‌’ టైటిల్‌ ఖరారు చేస్తూ పోస్టరును చిత్రబృందం విడుదల చేసింది. అనంతరం కొద్ది గంటల్లోనే మరొక పోస్టరునూ విడుదల చేసింది. 1980ల్లోని బ్లాక్‌ అండ్‌ వైట్‌ పోస్టరు తరహాలో ఇది ఉంది. కార్తి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం గమనార్హం.


లాంతర్‌ పాట విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: సాజి సలీమ్‌ దర్శకత్వంలో విదార్థ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లాంతర్‌’. వారిద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. చిత్రంలో శ్వేత డోరతి, విబిన్, సహానా గౌడ తదితరులు ఇతర నటీనటులు. చిత్రాన్ని ఎం సినిమా పతాకంపై పారిశ్రామికవేత్త బద్రి నిర్మిస్తున్నారు. తొలిపాట ‘అయల్‌ పిరై’ను చిత్రబృందం విడుదల చేసింది. ఉమాదేవి, దేవ రాసిన ఈ పాటను ప్రముఖ నేపథ్య గాయకుడు శక్తి శ్రీ గోపాలన్‌ పాడారు.


ఆనంద కృష్ణన్‌ తర్వాతి చిత్రం నాన్‌ వయొలెన్స్‌

చెన్నై, న్యూస్‌టుడే: ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘నాన్‌ వయొలెన్స్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. సినిమాలో బాబిసింహా, మెట్రో శిరిశ్, యోగిబాబు తదితరులు నటించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ నేపథ్యంలో టైటిల్‌ పోస్టరును చిత్రబృందం విడుదల చేసింది. ఇది వైవిధ్యమైన, ఆకట్టుకునే డిజైన్‌తో ఉండటంతో కథపై ఆసక్తి రేపుతోంది. ఏకే పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్లు త్వరలో విడుదల కానున్నట్లు, చిత్రం ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.


గరుడన్‌ తొలి సింగిల్‌ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో దర్శకనటుడు శశికుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గరుడన్‌’. ఉన్ని ముకుందన్, సూరి, సముద్రఖని, మైమ్‌ గోపి తదితరులు నటించారు. హాస్యనటుడు సూరి సీరియస్‌ రోల్‌ను పోషించాడు దర్శకుడు వెట్రిమారన్‌ కథ రాసి చిత్రాన్ని నిర్మించారు. రానున్న 31న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తొలి సింగిల్‌ ‘ఒత్తపడ వెరియాట్టం’ పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సూరి సన్నివేశాలు ఆయన క్యారెక్టర్‌పై అంచనాలు పెంచుతోంది.


ఆకట్టుకుంటున్న పోగుమిడం వెగుదూరమిల్లై ట్రైలర్‌ 

చిత్రంలో ఓ సన్నివేశం

చెన్నై, న్యూస్‌టుడే: మైఖేల్‌ కె.రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పోగుమిడం వెగుదూరమిల్లై’. చిత్రంలో విమల్, కరుణాస్, వేల రామమూర్తి, అడుకళం నరేన్, అరుళ్‌దాస్, దీపాశంకర్‌ తదితరులు నటించారు. త్వరలో జనం ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో విమల్, కరుణాస్‌ శవాన్ని తీసుకెళ్లే వాహనంలో ప్రయాణించే సన్నివేశాలు కనిపించాయి. 


చిత్రబృందానికి శివకార్తికేయన్‌ విందు

బిర్యాన్ని వడ్డిస్తున్న శివకార్తికేయన్‌ 

చెన్నై, న్యూస్‌టుడే: రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించిన చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కమల్‌ ఫిలిమ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మితమైంది. చిత్రీకరణ పనులు ముగిసిన నేపథ్యంలో చిత్రబృందానికి శనివారం శివకార్తికేయన్‌ విందు భోజనం ఏర్పాటు చేశారు. స్వయంగా బిర్యానీ వడ్డించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని