logo

అన్నామలై పొగడ్తలు అన్నాడీఎంకేకు అవసరం లేదు

అన్నామలై పొగడ్తలు అన్నాడీఎంకేకు అవసరం లేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ తెలిపారు. మదురై జిల్లా అలంగానల్లూర్‌ కోట్టైమేడులో పార్టీ తరఫున అన్నదానాన్ని మాజీ మంత్రి శనివారం ప్రారంభించారు.

Published : 26 May 2024 02:50 IST

ఆర్బీ ఉదయకుమార్‌ 

ప్యారిస్, న్యూస్‌టుడే: అన్నామలై పొగడ్తలు అన్నాడీఎంకేకు అవసరం లేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ తెలిపారు. మదురై జిల్లా అలంగానల్లూర్‌ కోట్టైమేడులో పార్టీ తరఫున అన్నదానాన్ని మాజీ మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మదురై, తేని, దిండుక్కల్‌ తదితర ఐదు జిల్లాల తాగు, సాగుకు అవసరమైన నీటిని అందించే ముల్లైపెరియార్‌లో మూడేళ్లుగా కేరళ ప్రభుత్వం కొత్త జలాశయాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దాన్ని అడ్డుకోకుండా డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో మదురై లేదా తేనిలో రైతుల హక్కులను కాపాడేందుకు అతిపెద్ద ఆందోళన చేపడతామని చెప్పారు. జయలలిత హిందుత్వ సిద్ధాంతాలు పాటించారని, ఆమె లేకపోవడంతో తాము పాటిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారన్నారు. అన్నాడీఎంకే మరో వందేళ్లు ప్రజాసేవ చేయాలన్న అమ్మ మాటలను ఎడప్పాడి పళనిసామి పాటించి ముందుకు సాగుతున్నారని తెలిపారు. అన్నామలై ప్రశంసలు అన్నాడీఎంకేకు అవసరం లేదన్నారు. ఆయన అన్నాడీఎంకే సభ్యుడిగా ఉండి అమ్మ గురించి మాట్లాడితే ఆమోదిస్తామన్నారు. ప్రజల కోసం తనను అంకితం చేసుకొని జీవించిన జయలలితను.. అన్నామలై రాజకీయ లబ్ధికి పొగిడితే ప్రజలు ఎలా ఆమోదిస్తారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని