logo

ఒకే కార్డు.. ప్రయోజనాలు మెండు

నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్స్‌’ (ఎన్‌సీఎంసీ)తో మెట్రో రైళ్లతో పాటు ‘మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ (ఎంటీసీ) బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది.

Published : 26 May 2024 02:59 IST

‘ఎన్‌సీఎంసీ’తో ఎంటీసీ బస్సులోనూ ప్రయాణం
త్వరలో అందుబాటులోకి సేవలు
న్యూస్‌టుడే, వడపళని

నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్స్‌’ (ఎన్‌సీఎంసీ)తో మెట్రో రైళ్లతో పాటు ‘మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ (ఎంటీసీ) బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రజా రవాణా మరింత మెరుగు పరచాలనే దృక్పథంతో చెన్నై మెట్రో రైలు గత ఏడాది ఏప్రిల్‌లో ఒక కార్డుతో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఈ రోజు వరకు మెట్రో రైలు ప్రయాణికులు మాత్రమే కార్డు కొనుక్కున్నప్పటికీ 16 శాతం మంది కార్డు సేవలను ప్రతిరోజూ వినియోగించుకుంటున్నారు.

జూన్‌ చివరిలోగా..

జూన్‌ నెలాఖరులోగా మెట్రో రైలు ప్రయాణికులు, ఎన్‌సీఎంసీ కార్డులున్న ఇతరులు కూడా నగదు చెల్లించి ఎంటీసీ బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యం రానుంది. గతంలోనే దీనిపై ‘చెన్నై యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ’ (సీయూఎంటీఏ).. సీఎంఆర్‌ఎల్, ఎంటీసీతో చర్చలు జరిపింది. తాజాగా మళ్లీ చర్చలు జరిగిన తర్వాత పథకాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంటూ సీయూఎంటీఏ రెండు సంస్థలకు లేఖ పంపింది. ఎన్‌సీఎంసీ కార్డు ఎంటీసీ ఎలక్ట్రానిక్‌ టిక్కెటింగ్‌ యంత్రాల్లో పని చేసేందుకు కావలసిన ఇతర పనులు ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే లాంఛనంగా సేవలు ప్రారంభిస్తామని సీయూఎంటీఏ అధికారులు పేర్కొన్నారు. 


ప్రజా రవాణా చేరువగా..

ఆలందూరు, చెన్నై సెంట్రల్, కీల్పాక్, చెన్నై ఎయిర్‌పోర్ట్, నందనం, సైదాపేట, లిటిల్‌ మౌంట్, గిండీ, కోయంబేడు, తిరుమంగళం మెట్రో స్టేషన్లకు బస్టాపులు దగ్గరగానే ఉన్నాయి. నిత్యం స్టేషను నుంచి బయటకు వచ్చే వందలాది మంది ప్రయాణికులకు, దగ్గరి ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంది. ప్రవేశపెట్టబోతున్న ఎన్‌సీఎంసీ కార్డుతో ప్రజా రవాణా ఎక్కువ మందికి వీలుగా ఉంటుందని సీఎంఆర్‌ఎల్‌ అధికారి ఒకరన్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే నిత్య ప్రయాణికులు పలువురు మాట్లాడుతూ.. మెట్రో రైళ్లు, ఎంటీసీ-బస్సులకు కలిపి ఒకే రకమైన కార్డు ప్రవేశపెట్టడంతో ప్రయాణం తేలికగానే ఉంటుందన్నారు. అదే మాదిరిగా ఎన్‌సీఎంసీ కార్డుతో సబర్బన్, ఎమ్మార్టీఎస్‌ రైళ్లలో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సీయూఎంటీఏ అధికారులు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించారు. భవిష్యత్తులో రైళ్లలో కూడా వినియోగించుకునేందుకు దక్షిణ రైల్వే అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని