logo

పంట భూముల స్వాధీన ఆదేశాలు ఉపసంహరించుకోవాలి: ఓపీఎస్‌

కోయంబత్తూరు జిల్లాలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కోసం పంట పొలాలను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు.

Published : 01 Dec 2022 00:45 IST

సైదాపేట, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లాలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కోసం పంట పొలాలను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... రైతుల అనుమతి లేకుండా కోయంబత్తూరులో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు 3,900 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరించమే ద్రావిడ మోడల్‌ పాలన అని ఎద్దేవా చేశారు. తమిళనాడు పరిశ్రమల అభివృద్ధి సంస్థ ద్వారా కోయంబత్తూరు జిల్లా సిరుముగై వద్ద 4 వేల ఎకరాలు, భవానీసాగర్‌ జలాశయం వద్ద 1,084 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌లు ఏర్పాటు చేసేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. ఈరోడు జిల్లా పెరుందురైలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్నారు. మళ్లీ కొత్తగా ఏర్పాటు చేస్తే కీళ్‌భవానీ తదితర ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతింటాయని, ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను అన్నాడీఎంకే తరఫున ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

జానకి అమ్మయార్‌ విగ్రహ ఏర్పాటు

పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ సతీమణి జానకి అమ్మయార్‌ 100వ జయంతిని పురస్కరించుకుని ఆయన విడుదల చేసిన ప్రకటనలో... పార్టీ కోసం నిరంతరం శ్రమించి, ఎంజీఆర్‌ వెన్నంటే ఉన్న జానకి అమ్మాళ్‌కు ఎంజీఆర్‌ మాళిగైలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే గదికి జానకి అమ్మయార్‌ పేరు, మొదటి అంతస్తులో ఉండే సమావేశ హాలుకు పురట్చి తలైవి అమ్మ (జయలలిత) పేరు పెట్టాలనే కోరికలు కార్యకర్తల నుంచి వస్తున్నాయని తెలిపారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అదేవిధంగా చెన్నై త్యాగరాయనగర్‌ ఆర్కాటు రోడ్డులోని ఎంజీఆర్‌ స్మారక చిహ్నంలో అనుమతి పొంది ఎంజీఆర్‌, ఆయన సతీమణి జానకి అమ్మయార్‌కు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు