పన్నీర్ వర్గంలో అసంతృప్తి!
అన్నాడీఎంకే ఏక నాయకత్వ వ్యవహారంలో ఆది నుంచే పన్నీర్‌సెల్వం ఎత్తులను చిత్తు చేస్తున్నారు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి.
భాజపా ఒత్తిడే కారణమా?
ఖుషీలో ఎడప్పాడి వర్గం
సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ఏక నాయకత్వ వ్యవహారంలో ఆది నుంచే పన్నీర్‌సెల్వం ఎత్తులను చిత్తు చేస్తున్నారు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి. తాజాగా రెండాకుల గుర్తు దక్కించుకున్న ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకేలో మరోసారి తన అధిపత్యాన్ని నిరూపించారు. ప్రారంభం నుంచే స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ, రాజకీయ చతురత ప్రదర్శిస్తూ అన్నాడీఎంకేను దాదాపు కైవసం చేసుకున్నారనే చెప్పాలి. మరోపక్క ఓపీఎస్ మొదటి నుంచి అస్పష్టమైన నిర్ణయాలతో మరోసారి డీలా పడ్డారు. దీంతో ఆయన్ను నమ్మి వచ్చిన మద్దతుదారులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే సర్వసభ్య వ్యవహారానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్‌లో ఉండగా ఈరోడు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా ఆకస్మిక మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ప్రకటించింది ఎన్నికల కమిషన్. దీంతో అన్నాడీఎంకే సర్వసభ్య కేసు ఏమవుతుంది, అన్నాడీఎంకే తరఫున ఎవరు పోటీ చేస్తారు, ఓపీఎస్ ఏం చేయనున్నారు, రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుంది తదితర పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మరోపక్క డీఎంకే కూటమిలో మళ్లీ ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కే కేటాయించారు. సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది డీఎంకే కూటమి. బలమైన అభ్యర్థి కావటంతో అన్నాడీఎంకే ఏమి చేస్తుందనే ఆసక్తి నెలకొంది. గతంతో అన్నాడీఎంకే కూటమిలో టీఎంసీకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించటం జరిగింది. అయితే ఈసారి పార్టీలో ఎలాగైనా తన బలాన్ని నిరూపించి తీరాలనే పట్టుదలతో ఉన్న ఎడప్పాడి పళనిస్వామి టీఎంసీ దగ్గర నుంచి ఆ నియోజకవర్గాన్ని తీసుకుని అన్నాడీఎంకే పోటీ చేస్తుందని ప్రకటించారు. అదే వేగంతో గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన సీనియర్ నేత కేఎస్ తెన్నరసును అభ్యర్థిగా ప్రకటించారు. వెనువెంటనే ఓపీఎస్ కూడా తన తరఫు అభ్యర్థి ప్రకటించారు. దీంతో రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుందనే చర్చలు తెరపైకి వచ్చాయి. అయితే వీటికి చెక్ పెట్టింది సుప్రీం కోర్టు. రెండాకుల గుర్తును తమకు కేటాయించాలని ఈసీని ఆదేశించాలని పళనిస్వామి పిటిషన్ దాఖలు చేయగా ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు కలిసి అభ్యర్థిని ఎంపిక చేయాలని కోర్టు ఆదేశించింది. అప్పుడే పన్నీర్ వర్గం డీలా పడింది. ఎక్కువ మంది మద్దతు పళనిస్వామికి ఉండటంతో పన్నీర్ వర్గం నీరసించింది.
ఎన్నికల సంఘం జోక్యంతో...
ప్రధానిని తంబిదురై కలిసిన దృశ్యం
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌కు రెండాకుల గుర్తు పొందే ఫారంలో సంతకం చేసే అనుమతి ఎన్నికల కమిషన్ ఇవ్వటం, గుర్తు ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. మరోవైపు తమిళ్‌మగన్ హుస్సేన్ చర్యలు చట్టవిరుద్ధమని చెప్పిన ఓపీఎస్ వర్గంలో ఒక్క రోజులోనే తమ అభ్యర్థిని ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్నాడీఎంకే నాయకత్వంపై ఈపీఎస్ మరింత పట్టు బిగించారు. అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నట్లు, రెండాకులు గుర్తు విజయానికి ప్రచారం చేయనున్నట్లు ఓపీఎస్ వర్గం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి భాజపా పన్నీర్‌పై తెచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ఇన్ని రోజులూ భాజపా మద్దతు పన్నీర్‌కే అనే సంకేతాలు కనిపించిన నేపథ్యంలో ఇటీవల మాజీ పార్లమెంట్ ఉప సభాపతి, ఎడప్పాడి మద్దతుదారుడు తంబిదురై ప్రధాని మోదీని కలిసి మాట్లాడిన తర్వాత పరిణామాలు మారాయని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇటీవల దిల్లీ వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై భాజపా పెద్దలతో ఆలోచనలు జరిపారు. తర్వాత చెన్నైకి చేరుకుని ఈపీఎస్, ఓపీఎస్‌లతో సమాధానం మాట్లాడినట్లు సమాచారం. రెండాకుల గుర్తు దక్కాలన్నదే అందరి ఆలోచన అని, ఇద్దరూ కలిసి ఉంటేనే మంచిదని ఈపీఎస్, ఓపీఎస్‌లతో చర్చలు జరిపారు. అయితే రెండాకుల గుర్తు దక్కకున్నా పోటీ చేస్తామని, కార్యకర్తలు తమ వైపు ఉన్నారని పళనిస్వామి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక ఎక్కువ మద్దతు పళనిస్వామికే ఉందని, కొంచెం దిగి రావాలని పన్నీర్‌కు సూచించారు. దీని గురించి ఓపీఎస్ ఇంట్లో పెద్ద చర్చలే జరిగినట్లు తెలుస్తోంది. చివరికి భాజపా ఒత్తిడికి తలొగ్గిన ఓపీఎస్ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పన్నీర్ నిర్ణయంతో ఆయన మద్దతుదారులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్న ప్రకటించాలని సీనియర్ నేత వైద్యలింగాన్ని కోరగా, ఆయన నిరాకరించినట్లు సమాచారం. భాజపా చెప్పేది వినటం సరికాదని వైద్యలింగం పేర్కొన్నట్లు సమాచారం. ఇదే అభిప్రాయం సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక మాజీ మంత్రి కృష్ణన్‌తో ఆ ప్రకటన చేయించారు ఓపీఎస్. ఉప ఎన్నికల్లో పోటీ చేసి పళనిస్వామికి దీటుగా బదులివ్వాలన్నదే పన్నీర్ మద్దతుదారుల ఉద్దేశం. అయితే ఓపీఎస్ నిర్ణయంతో వారు అంతా అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. దీంతో మున్ముందు ఓపీఎస్ చర్యలు ఎలా ఉంటాయి? మద్దతుదారులు ఆయన వెన్నంటి నిలుస్తారా? అనే పలు చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. ఓపీఎస్ నిర్ణయంపై శశికళ కూడా అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఓపీఎస్ సోదరుడు ఒ.రాజా వద్ద శశికళ తన అసహనాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు టీటీవీ దినకరన్ కూడా అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు ప్రెషర్ కుక్కర్ చిహ్నం దక్కలేదనే కారణం టీటీవీ చెప్పారు. అయితే ఇటీవల కాలంగా అంతా ఐక్యమవ్వాలనే ఓపీఎస్ అభిప్రాయాన్నే టీటీవీ దినకరన్ కూడా చెబుతుండటం గమనార్హం. శశికళ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో ఓపీఎస్, టీటీవీ, శశికళలు కలిసి అన్నాడీఎంకేలోకి వచ్చే అవకాశం ఉందా? వారంతా కలిసి ఎడప్పాడి హవాకు చెక్ పెట్టే ఎత్తుగడలా? అసలు భాజపా పెద్దల ఉద్దేశం ఏంటి? అనే అంశాలపై చర్చలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PBKS vs KKR: పంజాబ్ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు
-
Movies News
Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్
-
General News
Andhra News: ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్