logo

మోదీ పేరు..29 పైసలు

ప్రధాని మోదీని ఇకపై 29 పైసలు పేరుతో పిలవాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సూచించారు. ఉత్తర చెన్నై డీఎంకే అభ్యర్థి కళానిధి వీరాసామికి మద్దతుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 03 Apr 2024 00:12 IST

ఉదయనిధి

కళానిధి వీరాసామికి మద్దతుగా ఓట్లు కోరుతున్న ఉదయనిధి

చెన్నై, న్యూస్‌టుడే: ప్రధాని మోదీని ఇకపై 29 పైసలు పేరుతో పిలవాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సూచించారు. ఉత్తర చెన్నై డీఎంకే అభ్యర్థి కళానిధి వీరాసామికి మద్దతుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాధవరం హైరోడ్డులో ఆయన ప్రచారరథం నుంచి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రత్యర్థులందరూ కలిసి కట్టుగా వచ్చినా డీఎంకే కూటమికి భారీ విజయం లభించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు విడిపోయి వేర్వేరు కూటములుగా పోటీ చేయడంతో విజయం మరింత సునాయాసమవుతోందని భావించవద్దని తెలిపారు. పార్టీ అభ్యర్థి విజయానికి గట్టిగానే కృషి చేయాలని కోరారు. ఉత్తర చెన్నైలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలోని అంతరాన్ని తగ్గించేలా రూ.వెయ్యి కోట్లతో ప్రగతి ప్రాజెక్టును పది రోజుల కిందçË ముఖ్యమంత్రి ప్రారంభించారని పేర్కొన్నారు. ఉత్తర చెన్నైలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. భవిష్యత్తులో ఉత్తర చెన్నైలో ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు, కొడుంగైయూర్‌లోని డంపింగ్‌యార్డును పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలతో అన్నాడీఎంకే నేతలను బానిసలుగా చేసుకున్నట్లు డీఎంకే నేతలనూ చేయాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. ఆయనకు డీఎంకే భయపడదని తెలిపారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ కింద పన్నుగా తీసుకున్న ప్రతి రూపాయికి 29 పైసలు మాత్రమే మోదీ తిరిగి ఇస్తున్నారని, అందుకే ఆయన్ను 29 పైసలు పేరుతోనే పిలవాలన్నారు. తమిళనాడును మాత్రమే వంచిస్తున్న ఆయనకు ఈ ఎన్నికల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.


స్వతంత్ర అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీసు భద్రత: డీజీపీ ఆదేశం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు పోలీసు భద్రత ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానానికి ఏడుగురు రాజకీయ పార్టీల అభ్యర్థులు, 19 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యుర్థులకు ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ చొప్పున రోజు మొత్తం భద్రతా విధులు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం పోలీసుశాఖలోని సిగ్మా, ఇంటెలిజెన్స్‌, క్రైమ్‌, కోస్ట్‌గార్డ్‌, ట్రైనింగ్‌ స్కూల్‌ తదితర విధుల్లో ఉండేవారందరినీ నియమించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పలువురు ప్రచారం చేయకుండా నివాసాల్లోనే ఉంటున్నారు. వారికి ఇంటి వద్ద భద్రత కల్పించారు.

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా..

యానం ప్రాంత భాజపా అధ్యక్షుడు తెమ్మాడి దుర్గాప్రసాద్‌ గత శాసనసభ ఎన్నికల్లో యానం ప్రాంతంలో పోటీ చేయాలని నిర్ణయించారు. యానంలో భాజపా-ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమిలో ముఖ్యమంత్రి రంగసామి బరిలో నిలవగా అసంతృప్తితో దుర్గాప్రసాద్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భాజపా ఆయన్ను పార్టీ నుంచి తొలగించింది. ఆయన అదృశ్యమై ఐదురోజుల తర్వాత తిరిగొచ్చారు. తనను కొందరు కిడ్నాప్‌ చేసి నామినేషన్‌ వెనక్కి తీసుకోవాలని బెదిరించారని చెప్పారు. పోలీసు దర్యాప్తులో ఆయన కిడ్నాప్‌ నాటకం ఆడినట్లు తేలింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు భద్రత కల్పించాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని