logo

దశ తిరిగేదెవరికి ?

రాష్ట్రంలో మూడు ప్రధాన కూటములు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కూటమిలోని అగ్రపార్టీలు పలు నియోజకవర్గాను ఇతర పార్టీలకు పొత్తుల్లో కేటాయించినా.. కొన్నింటిని తమ వద్దే పెట్టుకున్నారు.

Published : 03 Apr 2024 00:16 IST

పది స్థానాల్లో నేరుగా తలపడుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా

రాష్ట్రంలో మూడు ప్రధాన కూటములు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కూటమిలోని అగ్రపార్టీలు పలు నియోజకవర్గాను ఇతర పార్టీలకు పొత్తుల్లో కేటాయించినా.. కొన్నింటిని తమ వద్దే పెట్టుకున్నారు. డీఎంకే, భాజపా, అన్నాడీఎంకేలు నేరుగా 10 నియోజకవర్గాల్లో పోరుకు సిద్ధమయ్యాయి. ముక్కోణపు పోటీలో విజయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఈనాడు-చెన్నై: ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, భాజపాలు నేరుగా పోటీపడే పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఆయా పార్టీలు విజయంపైనే పూర్తి దృష్టిసారించాయి. ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, వేలూరు, తిరువణ్ణామలై, నామక్కల్‌, నీలగిరి(ఎస్సీ), కోయంబత్తూరు, పొళ్లాచ్చి, పెరంబలూర్‌, తెన్‌కాశి నియోజకవర్గాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇక్కడి అభ్యర్థులు ఇతర పార్టీల మద్దతుగా నేరుగా తమ పార్టీ గుర్తులతో బరిలో ఉన్నారు. ఈ స్థానాల్లో మూడు పార్టీలు తమను తాము అత్యంత బలమైనవిగా భావిస్తున్నాయి. అక్కడ పోరు కూడా అదే స్థాయిలో ఉంది.

కన్నేసిన భాజపా

తమిళనాడుపై భాజపా పెద్దకన్నే వేసిందని చెప్పాలి. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి నేతలతో నేరుగా మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు కమలం నేరుగా ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే సాధించిన ఒక సీటుకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు నేరుగా తమ పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. తమిళనాడు నుంచి ఈసారి కొన్ని స్థానాలనైనా సాధించుకోవాలని తహతహలాడుతోంది.

హోరాహోరీనే..

వేలూరులో ఈసారి హోరీహోరీ పోరు తప్పేలా లేదు. డీఎంకే నుంచి పోటీచేస్తున్న డీఎం కదిర్‌ ఆనంద్‌ ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీ. 2019లో కేవలం 8,141 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికలపరంగా మొత్తం 6 స్థానాల్లో 4 డీఎంకే, 2 అన్నాడీఎంకే కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గట్టిపోటీనే ఉండొచ్చని తెలుస్తోంది. అన్నాడీఎంకే నుంచి ఎస్‌.పశుపతి, భాజపా నుంచి ఏసీ షణ్ముగం పోటీలో ఉన్నారు. ఈయనకు 2019 ఎన్నికల్లో 46.42శాతం ఓట్లొచ్చాయి.

  • తిరువణ్ణామలై స్థానానికి ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ సి.ఎన్‌.అన్నాదురై డీఎంకే నుంచి బరిలో ఉన్నారు. గతసారి 3,04,187 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఈయనకు పోటీగా అన్నాడీఎంకే నుంచి ఎం.కలియ పెరుమాల్‌, భాజపా నుంచి ఎ.అశ్వనాథన్‌ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వచ్చే 6 స్థానాలను 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దక్కించుకుంది.

ఫలితంపై ఆసక్తి

కోయంబత్తూరుపై భాజపా భారీ ఆశలు పెట్టుకుంది. ఇదే పార్లమెంటు నియోజకవర్గంలోని దక్షిణ కోయంబత్తూరును 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తుతో భాజపా కైవసం చేసుకుంది. ఈ ఒక్క నియోజకవర్గం బలంతో, మిగిలినచోట్ల కమలం పుంజుకుందనే భావనతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఈ ఎంపీ స్థానానికి బరిలో నిల్చున్నారు. ఈ పార్లమెంటు స్థానాన్ని 2019లో డీఎంకే కైవసం చేసుకుంది. 2021లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అన్నాడీఎంకే అన్ని నియోజకవర్గాల్లో పుంజుకొంది. ఇక్కడ పోటీపై సర్వత్రా ఆసక్తిగా మారింది. డీఎంకే నుంచి గణపతి పి.రాజ్‌కుమార్‌ బరిలో ఉన్నారు. 2014-16 మధ్య కోయంబత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌గా కొనసాగారు. మరోవైపు అన్నాడీఎంకే నుంచి సింగై జి.రామచంద్రన్‌ బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్నారు.

రాష్ట్ర రాజధానిలో..

దక్షిణ చెన్నైలో ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌ సత్తా నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భాజపా నుంచి మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి డి.జయకుమార్‌ కుమారుడు జె.జయవర్ధన్‌ బరిలో ఉన్నారు. 2014లో ఇక్కడ అన్నాడీఎంకే తిరుగులేని విజయం నమోదు చేసుకున్నా.. 2019లో మాత్రం ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తోంది. గెలుపు కోసం తమిళిసై సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర చెన్నైలో సైతం డీఎంకే నుంచి సిట్టింగ్‌ ఎంపీ కళానిధి వీరసామి తన గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈయనకు పోటీగా అన్నాడీఎంకే నుంచి రాయపురం ఆర్‌.మనో, భాజపా నుంచి ఆర్‌.సి.పాల్‌ కనకరాజ్‌ బరిలో ఉన్నారు.

గిరిపై పట్టుకోసం..

ఎస్సీ రిజర్వుడు నీలగిరి నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపీ ఎ.రాజా మళ్లీ డీఎంకే నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో 2,05,823 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ పార్లమెంటులోని అసెంబ్లీ స్థానాల్లో అన్నాడీఎంకే పాగావేసింది. కూనురు, ఉదగమండలం మినహా మిగిలిన మూడింటిలో అన్నాడీఎంకే గెలిచింది. ఈసారి అక్కడ అన్నాడీఎంకే ఎంపీ అభ్యర్థిగా లోకేష్‌ తమిళ్‌సెల్వన్‌ను పోటీగా పెట్టారు. ఈయన అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పి.ధన్‌పాలన్‌ కుమారుడు. వారికి పోటీగా భాజపా నుంచి కేంద్ర సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌ రంగంలోకి దిగారు.

నామక్కల్‌ స్థానం

డీఎంకే వశమైనా ఈసారి సిట్టింగ్‌ ఎంపీ ఏకేపీ చిన్నరాజ్‌ను కాకుండా వి.ఎస్‌.మతేశ్వరన్‌ను రంగంలోకి దించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 6 నియోజకవర్గాల్లో డీఎంకేకు 4, అన్నాడీఎంకే 4 దక్కాయి.

తెన్‌కాశి ప్రత్యేకం

తెన్‌కాశి(ఎస్సీ) స్థానాన్ని 2019లో డీఎంకే వశపరచుకుంది. సిట్టింగ్‌ ఎంపీ ధనుష్‌ ఎం.కుమార్‌స్థానంలో మహిళా అభ్యర్థి రాణిశ్రీకుమార్‌కు ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది. పుదియ తమిళగం వ్యవస్థాపకులు కె.కృష్ణసామి అన్నాడీఎంకే రెండాకుల గుర్తుతో పోటీకి దిగారు. భాజపా మరో ఎత్తుగడ వేసింది. న్యాయవాది, సామాజికవేత్త, తమిళగ మక్కల్‌ మున్నేట్ర కళగం అధినేత బి.జాన్‌ పాండియన్‌ను తమ పార్టీలోకి తీసుకుని కమలం గుర్తుపై పోటీకి దించింది. ఈ నియోజకవర్గంలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3చోట్ల డీఎంకే, 2చోట్ల అన్నాడీఎంకే, ఒకస్థానంలో కాంగ్రెస్‌ గెలిచింది.

పెరంబలూర్‌లో

మంత్రి కేఎల్‌ నెహ్రూ కుమారుడు అరుణ్‌నెహ్రూపై డీఎంకే ఆశలుపెట్టుకుంది. డీఎంకే ఎన్నికల గుర్తుతో 2019లో గెలుపొందిన టీఆర్‌ పారివేందర్‌ భాజపాలో చేరారు. కమలం గుర్తుతో ఇప్పుడు ఇదే స్థానానికి బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ వారిద్దరి మధ్యే ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి ఎన్డీ చంద్రమోహన్‌ పోటీపడుతున్నారు. ఈ పార్లమెంటులోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ డీఎంకే ఎమ్మెల్యేలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని