logo

‘ప్రజాగళం’ వినిపించేలా!!

సార్వత్రిక ఎన్నికల ప్రకటన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారానికి వస్తున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో ఇప్పటికే వివిధ జిల్లాల్లో సాగుతున్న సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో కూటమి నేతల్లో విజయోత్సాహం కనిపిస్తోంది.

Published : 14 Apr 2024 04:07 IST

నేడు గాజువాకలో చంద్రబాబు సభ

ఈనాడు, విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికల ప్రకటన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారానికి వస్తున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో ఇప్పటికే వివిధ జిల్లాల్లో సాగుతున్న సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో కూటమి నేతల్లో విజయోత్సాహం కనిపిస్తోంది. వైకాపా పాలనలో జరిగిన అకృత్యాలను చంద్రబాబు ఎండగడుతున్నారు. అభివృద్ధిపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు కూడా ఆయనతో ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో జరిగే సభలు కూడా విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం గాజువాక కూడలిలో రాత్రి ఏడు గంటలకు సభ నిర్వహించనున్నారు. అంతకు ముందు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు.

జనంలో ఆసక్తి: 2019 ఎన్నికల్లో చంద్రబాబు గాజువాక తప్ప విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేపట్టారు. ఆ లోటును భర్తీ చేయడానికి ఈ ఎన్నికల ప్రకటన అనంతరం విశాఖ జిల్లాలో మొదటి ప్రచార కార్యక్రమానికి గాజువాకను ఎంచుకున్నారు. దీంతో తెదేపా కార్యకర్తలతో పాటు జనసేన, భాజపా కార్యకర్తలు, ప్రజలు  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సభకు అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, యువత తరలివస్తారని కూటమి నేతలు చెబుతున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల నుంచి తెదేపా, జనసేన,   భాజపా నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. అలాగే.. అనకాపల్లి జిల్లాలో జరిగే రెండు ప్రజాగళం సభల్లో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు. ఈ నెల 16న చోడవరం, ఎలమంచిలిలో సభలు జరగనున్నాయి. ఈ రెండింటిలో ఇరు పార్టీల అధినేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి కొన్ని జిల్లాల్లో ‘ప్రజాగళం’ యాత్రలో పాల్గొనగా.. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సభలకూ అదే స్థాయిలో ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని నేతలు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు