logo

పీడించిన అధికారిని వదిలేశారు!!

వైకాపా నాయకులతో అంటకాగుతున్న ఉన్నతాధికారిని వదిలేసి కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే కలెక్టర్‌ చర్యలు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

Updated : 14 Apr 2024 04:39 IST

అధికార పార్టీ తరఫున ప్రచారానికి ఒత్తిళ్లు
కంటితుడుపుగా యూసీడీ సీవోలు, ఆర్పీలపై వేటు
జిల్లా కలెక్టర్‌ తీరుపై ప్రతిపక్షాల అసహనం
మంత్రి ఒత్తిడితో తూతూమంత్రపు చర్యలు?

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: వైకాపా నాయకులతో అంటకాగుతున్న ఉన్నతాధికారిని వదిలేసి కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే కలెక్టర్‌ చర్యలు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇటీవల తూర్పు నియోజకవర్గంలో మహిళా సంఘాల సభ్యులు వైకాపా అభ్యర్థి ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చిన జోన్‌-3 పట్టణ సామాజిక ఆభివృద్ధి (యూసీడీ) పరిధిలోని ముగ్గురు సీవోలపై కలెక్టర్‌ వేటు వేశారు. సంబంధిత ఏపీడీకి షోకాజ్‌ నోటీసులిచ్చి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అయితే అసలు కథ నడిపిన పీడీపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యూసీడీ ఉన్నతాధికారి ఆదేశాల్లేకుండానే కింది స్థాయి అధికారులు, సిబ్బంది వైకాపా అభ్యర్థులకు మద్ధతుగా నిలిచే అవకాశం లేదని ప్రతిపక్ష నాయకులు పేర్కొంటున్నారు.

కొమ్ముకాసి బలైన సీవోలు, ఆర్పీలు: విషయం బయటకు రావడంతో దీని నుంచి బయటపడాలని యూసీడీ పీడీ పన్నాగం పన్నారు. ‘ఉన్నతాధికారికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మేమే ఆధార్‌, ఓటు కార్డులు సేకరించాం’ అంటూ తూర్పు నియోజకవర్గంలో పలువురు ఆర్పీలపై ఒత్తిడి పెట్టి లేఖలు రాయించినట్లు తెలుస్తోంది. బలవంతంగా ఏపీడీ, సీవోలతో అదనపు కమిషనర్‌ ముందు స్టేట్‌మెంట్లు ఇప్పించినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారి తప్పించుకుని, కొమ్ము కాసినందుకు సీవోలు, ఆర్పీలు బలైనట్లు ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

  • వైకాపా అభ్యర్థులతో అంటకాగుతూ యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘిస్తున్న యూసీడీ పీడీ పాపునాయుడిపై సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేయనున్నట్లు జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ తెలిపారు.

విచారణలో అధికారి పాత్రపై స్టేట్‌మెంట్‌: యూసీడీ పీడీ పాపునాయుడు దగ్గరుండి తూర్పు వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్దకు తీసుకెళ్లి ఏపీడీ, సీవోలు, ఆర్పీలకు డబ్బులిప్పించినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ సమయంలో ఇది వాస్తవని ఓ ఆర్పీ విచారణాధికారిగా ఉన్న అదనపు కమిషనర్‌కు రాత పూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. ‘ఎంవీవీ ఇంటికి తీసుకెళ్లి ఒక్కొక్కరికి రూ.25వేలు ఇప్పించారు. తీసుకోకపోతే కుదరదు అన్నారు. చెప్పినట్లు పనిచేయాల్సిందే’ అని పీడీ బెదిరించారని ఆర్పీ చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. పీడీ ఆదేశాలతోనే సీవోలు డ్వాక్రా మహిళలకు స్వీట్లు, చీరలు సైతం పంపిణీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నా కొనసాగింపు:

జీవీఎంసీ యూసీడీ పీడీ పాపునాయుడిపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్‌శాఖకు చెందిన ఆయన వైకాపా పెద్దల ఆశీస్సులతో జీవీఎంసీ యూసీడీ విభాగానికి వచ్చారు. ప్రారంభంలో సీవో (కమ్యునిటీ ఆర్గనైజర్‌) ఉద్యోగాలిప్పిస్తానని ఆర్పీల నుంచి రూ.5లక్షల చొప్పున వసూలు చేశారని జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ గతంలో ఆరోపించారు. పెదజాలారిపేట ఆదర్శ గ్రామంలో ఇళ్ల కేటాయింపులోనూ చేతివాటం ప్రదర్శించారని, రూ.లక్షల ముడుపులు తీసుకుని వైకాపా కార్యకర్తలకు అమ్ముకున్నట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. ఓ సంస్థకు చెందిన నిత్యావసరాలను 1080 మంది ఆర్పీల ద్వారా డ్వాక్రా మహిళలకు విక్రయించి సుమారు రూ.2.50కోట్లు వసూలు చేశారని ఆధారాలతో గతంలో జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. ఎన్ని ఆరోపణలున్నా పక్క జిల్లాకు చెందిన వైకాపా మంత్రి ఆయన్ను కాపాడుకుంటూ వస్తున్నారు.

కలెక్టర్‌ ఉత్తర్వులు ఇలా..

సస్పెండ్‌: జోన్‌-3 పరిధిలోని 17వ వార్డు కమ్యూనిటీ ఆఫీసర్‌ (సి.ఒ.) తిరుమలరావు, 18వ వార్డు సి.ఒ. నరసింహులు, 19వ వార్డు సి.ఒ. ఎస్‌.వి.రమణ
షోకాజ్‌ నోటీసు: జోన్‌-3 ఏపీడీ దుర్గాప్రసాద్‌(ఎన్నికల విధుల నుంచి తొలగింపు)
విధుల నుంచి తొలగింపు: 17, 18, 19 వార్డుల సి.ఒ.ల పరిధిలోని ఆర్పీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని