logo

ప్రతినెలా బాదుడే.. బిల్లు చూస్తే దడే!!

ఆస్తి పన్ను... చెత్త పన్ను... పేరెత్తితే జనం హడలిపోతున్నారు. ఇలాంటి జాబితాలో ‘షాక్‌’ కొట్టే మరొకటి కూడా ఉంది... అదే విద్యుత్తు బిల్లు. ప్రతి నెలా రీడింగ్‌ తీసి చేతిలోపెట్టే ఆ బిల్లు చూసిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.

Published : 14 Apr 2024 09:20 IST

వైకాపా ప్రభుత్వ ఉచ్చులో విద్యుత్తు వినియోగదారులు
జనంపై రూ. కోట్లలో భారం

ఆస్తి పన్ను... చెత్త పన్ను... పేరెత్తితే జనం హడలిపోతున్నారు. ఇలాంటి జాబితాలో ‘షాక్‌’ కొట్టే మరొకటి కూడా ఉంది... అదే విద్యుత్తు బిల్లు. ప్రతి నెలా రీడింగ్‌ తీసి చేతిలో పెట్టే ఆ బిల్లు చూసిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ‘మనం ఎంత వాడాం.. ఎంత బిల్లు వచ్చింది’ అనే చర్చ సాగుతోంది.

ఈనాడు, విశాఖపట్నం: వినియోగించిన విద్యుత్తుకు లెక్కకట్టి రుసుం ఎంత చూపుతున్నా...ఆ తరువాత క్రమంలో ఉన్న ఒక్కొక్క వరుస చదివిన ఎవరైనా తెల్లబోవాల్సింది. మొత్తం జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. వైకాపా నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘బటన్‌ నొక్కుతున్నాం’గా అంటూ తప్పించుకునే ధోరణిలో పాలించారు.

వైకాపా సర్కారు అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం భారీగా మోపింది. కొన్ని వర్గాల కనెక్షన్లకు సంబంధించి టారిఫ్‌లో మార్పులు చేయకపోయినా స్లాబులు మార్చి దొడ్డిదారిన ఛార్జీలు పెంచేశారు. వీటికి అదనంగా 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేశారు.

  • గతేడాది ఏప్రిల్‌ నుంచి రెండు విడతల ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) ఛార్జీలను వడ్డిస్తున్నారు. సామాన్యుల విద్యుత్తు బిల్లులో ఈ వడ్డింపులే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటున్నాయి. అదే పారిశ్రామిక, వాణిజ్య వర్గాల బిల్లుల్లో అదనపు సుంకాలు రూ.వేలల్లో ఉంటున్నాయి. అందుకే కరెంటు బిల్లులు చూస్తేనే షాక్‌ కొట్టేలా ఉన్నాయి.  2022-24లో విశాఖ సర్కిల్‌ పరిధిలోని ఉమ్మడి జిల్లా వినియోగదారులపై వివిధ రూపాల్లో రూ.964 కోట్లు అదనపు భారం మోపారు. ఈ ఏడాది ఎన్నికలున్నాయని పెంపు జోలికి పోలేదు. డిస్కంలు మరో రూ.7 వేల కోట్లు ట్రూఅప్‌ వసూలుకు ఏపీఈఆర్సీ వద్ద ప్రతిపాదనలు పెట్టాయి. ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపై వేయడానికి సిద్ధంగా ఉంచారు.

అదనంగా వడ్డించేశారిలా..: ట్రూఅప్‌ ఛార్జీలు యూనిట్‌కు 17 పైసలు చొప్పున సర్కిల్‌ మొత్తం వినియోగంపై నెలకు రూ.11.9 కోట్లు వసూలు చేశారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో వినియోగదారుల నుంచి రూ.202.3 కోట్లు వసూలు చేశారు.

  • ఎఫ్‌పీపీసీఏ-2 పేరుతో  2023 మే నెల నుంచి యూనిట్‌కు 40 పైసలు చొప్పున మరో భారం మోపుతున్నారు. సర్కిల్‌లో నెలకు సగటున 70 కోట్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన 40 పైసలు చొప్పున నెలకు రూ.28 కోట్లు అదనపు సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే 12 నెలల నుంచి రూ.28 కోట్లు చొప్పున రూ.336 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మరో ఏడాది పాటు ఈ ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలు మోయాల్సిందే.

మూడు నెలలకోసారి చెల్లించింది (రూ.కోట్లలో)

ఎఫ్‌పీపీసీఏ-1 వసూలు ఇలా..

జులై- సెప్టెంబర్‌ 130.2
2023 ఏప్రిల్‌- జూన్‌  39.9
అక్టోబర్‌- డిసెంబర్‌ 119.7
మొత్తం భారం : 426.3 కోట్లు
2024 జనవరి-మార్చి 136.5

ఓ ఉదాహరణ..

అసలు 609.. సుంకాలు 310 !

నగరంలోని మద్దిలపాలేనికి చెందిన ఎ. అప్పలనాయుడు 2021 అక్టోబర్‌లో 185 యూనిట్ల విద్యుత్తు వినియోగించారు. అందుకు గాను సుంకాలతో కలిపి రూ.679ల కరెంటు బిల్లు వచ్చింది. అదే వినియోగదారుడు ఈ ఏడాది జనవరిలో 157 యూనిట్లే వినియోగించారు. బిల్లు మాత్రం రూ.919 వచ్చింది. వాస్తవానికి 185 యూనిట్లు వినియోగించినప్పుడు రూ.679 బిల్లు వస్తే  157 యూనిట్లు వాడినప్పుడు బిల్లు ఇంకా తక్కువగా రావాలి. కానీ, జగనన్న పాలనలో అదనపు సుంకాల కారణంగా కరెంటు తక్కువ వాడినా రూ.240 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.

  • ఇందులో టారీఫ్‌ ప్రకారం విద్యుత్తు ఛార్జీలు రూ.609. మిగతా  అదనపు సుంకాలే రూ.310 ఉండడంతో బిల్లు రూ.919 పెరిగిపోయింది. ఈ బిల్లు ఒక్కరోజు ఆలస్యమైనా అదనంగా మరో రూ.25 చెల్లించాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని