logo

ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!

నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది.

Updated : 19 Apr 2024 07:23 IST

వీఐపీ రోడ్డు మూసివేతతో తరచూ ప్రమాదాలు
ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు

దారి మళ్లకుండా ఏర్పాటు చేసిన విభాగిని

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. వీఐపీ రహదారి నుంచి ఆశీలుమెట్ట వైపు వాహనాలు వెళ్లకుండా రహదారిని విభాగినులతో మూసివేయడం సమస్యగా మారింది. ట్రాఫిక్‌ పోలీసులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ద్విచక్రవాహన చోదకులు బాధితులుగా మారుతున్నారు. వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ ఇటీవల ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకంటే ముందు ఓ కారు విభాగినిపైకి ఎక్కి బీభత్సం సృష్టించింది. ఆశీలుమెట్ట నుంచి జీవీఎంసీ కార్యాలయం వైపు వస్తున్న ఓ యువతి ద్విచక్రవాహనాన్ని ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, వాహనం నుజ్జయింది.

వీఐపీ రోడ్‌లో ఎదురెదురుగా వాహనాలు

అందుకే మూసివేత: వాస్తు దోషం కారణంగా సీబీసీఎన్‌సీ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడం లేదని, వీఐపీ రహదారిని మూసివేస్తే వాస్తు దోషం పోతుందనే నమ్మకంతో రహదారిపై విభాగిని ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వీఐపీ రహదారి- ఆశీలుమెట్ట మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేవి. వీఐపీ రహదారి నుంచి వచ్చే వాహనాలు ముందుగా సిరిపురం వైపు తిరిగి, కాస్త ముందుకెళ్లిన తరువాత మలుపు(యూ టర్న్‌) తీసుకోవాల్సి ఉంటుంది. సిరిపురం నుంచి వీఐపీ రహదారికి రావాలంటే సంపత్‌ వినాయగర్‌ ఆలయం దాటి వేమన మందిరం వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘షాపర్స్‌’ స్టాప్‌ దాటిన తరువాత కాస్త ముందుకెళితే కుడివైపు తిరిగే వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో టైకూన్‌ హోటల్‌ వైపు ఉన్న మార్గాల నుంచి వచ్చే వాహనచోదకులు రాంగ్‌ రూటÂలో వచ్చి ఎడమ వైపు ఉన్న రహదారిలోకి మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు.

టైకూన్‌  కూడలి వద్ద ఇలా...

ఫిర్యాదులు వస్తున్నా చర్యలేవీ?:  వీఐపీ రోడ్డులో విభాగినుల ఏర్పాటుపై ప్రజలపై నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడం లేదు. గతంలో స్వయానా ఎంపీ ఎంవీవీ జీవీఎంసీ కమిషనర్‌, సీపీలను కలిసి విభాగినులను తొలగించాలని వినతిపత్రాలు అందజేశారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో తన తప్పులేదని తప్పించుకోవడానికి ఎంపీ ఇలా వినతిపత్రాలు ఇచ్చారని నాడు విమర్శలొచ్చాయి. ఇది జరిగి 8 నెలలైనా ఉన్నతాధికారులు విభాగినుల తొలగింపునకు ఎటువంటి చొరవ తీసుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని