logo

‘గంజాయి’ తోటల్లో ఆటలు ‘సాగు’తున్నాయ్‌!

వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అంటే గంజాయికి చిరునామాగా మారింది. ముంబై పబ్‌లలో, గోవా బీచ్‌ల్లో... దిల్లీ నుంచి హైదరాబాద్‌ గల్లీ వరకు ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ పేరే వినిపిస్తోంది.

Published : 22 Apr 2024 03:29 IST

  ఏజెన్సీలో పడకేసిన ఆపరేషన్‌ ‘పరివర్తన
  అధికార పార్టీ నాయకుల అండతో దర్జాగా సాగు, రవాణా
విశాఖ మీదుగా పలు రాష్ట్రాలకు తరలింపు

స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు (పాతచిత్రం)

ఈనాడు - విశాఖపట్నం : వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అంటే గంజాయికి చిరునామాగా మారింది. ముంబై పబ్‌లలో, గోవా బీచ్‌ల్లో... దిల్లీ నుంచి హైదరాబాద్‌ గల్లీ వరకు ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ పేరే వినిపిస్తోంది. మత్తుకు బానిసలైన విద్యార్థులు, యువత జీవితాలు ఛిద్రమవుతున్నా సీఎం జగన్‌కు చీమ కుట్టినట్లైనా లేదు. కట్టడికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో అత్యంత డిమాండ్‌ కలిగిన శీలావతి రకం గంజాయి సాగుకు అడ్డాగా ‘ ఉమ్మడి విశాఖ’ మారింది. ఒడిశా సరిహద్దుల్లో పండించి విశాఖ మీదుగా ఇతర రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తున్నారు. సాగు కట్టడికి, యువతలో ఆలోచనల మార్పునకు విశాఖ ఏజెన్సీలో చేపట్టిన ‘ఆపరేషన్‌ పరివర్తన’ పడకేసింది. ఇంటెలిజెన్స్‌ నివేదికలు, శాటిలైట్‌ ఫొటోల ఆధారంగా సాగును గుర్తించినా.. సాగు చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పన, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంపై కార్యాచరణ లోపించిందనే విమర్శలున్నాయి.

గణాంకాలే చెబుతున్నాయి : అధికారంలోకి వచ్చిన తర్వాత  పరిపాలనా రాజధానిగా విశాఖను మారుస్తామంటూ జగన్‌ ఊదరగొట్టారు. పరిపాలనా రాజధానిగా మార్చలేదు కానీ.. గంజాయికి అడ్డాగా మాత్రం మార్చేశారు. దేశంలో గంజాయి సరఫరాలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు. 2021లో దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంటే అందులో ఏపీ నుంచే 46% స్వాధీనం చేసుకున్నామని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 23 లక్షల కేజీల గంజాయి పట్టుబడగా, అందులో అత్యధిక భాగం ఏపీ నుంచి సరఫరా అయిందే. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో కంటితుడుపుగా కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో విశాఖ కమిషనరేట్‌ పరిధిలో కేవలం 13,326 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 1800 మందిపై కేసులు నమోదు చేశారు.

అవును.. నిజమనేలా : గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విశాఖ పర్యటనలో భాగంగా ‘జగన్‌ పాలనలో విశాఖ అరాచకశక్తులకు అడ్డాగా మారింది’ అని వ్యాఖ్యానించారు. తర్వాత కొద్దిరోజులకే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులను రౌడీషీటర్లు కిడ్నాప్‌ చేసి 48 గంటలపాటు గంజాయి మత్తులో చిత్రహింసలు పెట్టడం సంచలనమైంది. జేబుల నిండా తెచ్చుకున్న గంజాయి ఖాళీ కాగానే.. నిమిషాల వ్యవధిలో బయట నుంచి నేరుగా గంజాయి తెప్పించుకోవడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో దాదాపు 8,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.765 కోట్లకు పైగా విలువైన రెండు లక్షల కేజీల గంజాయిని పోలీసులు తగలబెట్టారు. అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వ పెద్దలు కన్నెర్రజేసినట్లు విమర్శలున్నాయి. సాగు, రవాణాలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉండటంతోనే గంజాయి దహనం  చేయకుండా ఒత్తిళ్లు తెచ్చినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో గంజాయి రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. ఇటీవల పెందుర్తి, నర్సీపట్నానికి చెందిన అధికార పార్టీ నాయకులు గంజాయి రవాణా చేస్తూ చిక్కారు. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

గంజాయి ఖైదీలే ఎక్కువ : వైకాపా పాలకులు అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, గిరిజన యువతను నిరుద్యోగులుగా మార్చి చివరకు గంజాయి రవాణా ఉచ్చులోకి దిగేలా పరోక్షంగా ప్రోత్సహించారు. విశాఖ కేంద్ర కారాగారంలో 9 బ్యారెక్‌లలో 1700 మంది ఉండగా.. అందులో 1200 మంది గంజాయి కేసుల్లోని రిమాండ్‌ ఖైదీలే ఉండటం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు