logo

ఎన్నికల వేళ.. ప్రారంభోత్సవాలు ఏల!

‘ఎన్నికల వేళ.. అభ్యర్థుల అక్రమాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. తాయిలాల పంపిణీకి అడ్డుకట్ట వేయాలి. ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు.. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాల’ని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఇటీవల ఎన్నికల అధికారుల సమావేశాల్లో హితవు పలికారు.

Published : 22 Apr 2024 03:46 IST

జిల్లా కలెక్టర్‌ తీరుపై ప్రతిపక్షాల విమర్శ

ఈనాడు, విశాఖపట్నం: ‘ఎన్నికల వేళ.. అభ్యర్థుల అక్రమాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. తాయిలాల పంపిణీకి అడ్డుకట్ట వేయాలి. ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు.. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాల’ని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఇటీవల ఎన్నికల అధికారుల సమావేశాల్లో హితవు పలికారు. కాని ఆయనే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అత్యవసరమైన పనులు తప్ప ఇతరత్రా వాటి జోలికి వెళ్లకూడదు. కాని కలెక్టర్‌ మాత్రం వసతిగృహాలకు, కొన్ని నూతన నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేశారు. సీఎస్సార్‌ నిధులతో ఆయా పనులు చేపట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బడులకు వేసవి సెలవులు ఇచ్చారు..ఈ సమయంలో వసతిగృహాలకు ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం లేదని, అది అత్యవసరమైన పని కాదని, ఎన్నికల వరకు ఎందుకు ఆగలేక పోయారని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఐఅండ్‌పీఆర్‌ ద్వారా జిల్లాలోని వసతిగృహాల్లో చేపట్టిన పనులపై ఆదివారం కలెక్టర్‌ ఒక ప్రకటన ఇచ్చారు. అందులో మూడు ప్రభుత్వ వసతిగృహాలను రూ.86.10 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో ఆధునికీకరించినట్లు తెలిపారు. అంతేకాకుండా 18 నెలల్లో రూ.5.63 కోట్లతో పలు వసతిగృహాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సీఎస్‌ఆర్‌ నిధులతో ఆయా పనులు చేసినా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో వాటికి ప్రారంభోత్సవాలు చేయడం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లుగా భావించాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ?:సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి జిల్లాలో అధికారపార్టీ వైకాపా అభ్యర్థులు చెలరేగిపోతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ విచ్చలవిడిగా డబ్బులు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌పై ఉంది. కాని కలెక్టర్‌ అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారి అరాచకాలపై ఫిర్యాదులు చేస్తున్నా పెద్దగా స్పందించలేదని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. మరో పక్క ఎక్కడాలేని విధంగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి.

రాజకీయ భాగస్వామ్యం లేదు..:  ‘వసతిగృహాల నవీకరణ పనులు సీˆఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టాం. ఇందులో ప్రభుత్వ నిధులు లేవు. అంతేకాకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రారంభోత్సవం చేశాం. ఇప్పటికే సీˆఎస్‌ఆర్‌ నిధులతో కేజీహెచ్‌లోనూ ఆధునికీకరణ పనులు చేపట్టాం. ఇందులో ఎటువంటి ఎన్నికల నిబంధన ఉల్లంఘన లేద’ని కలెక్టర్‌ మల్లికార్జున వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని