logo

అక్షరాల ఇది మాయే!!

‘అమ్మ ఒడి’ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం జగన్‌ వంచించారు. పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ఈ పథకం కింద ఏటా రూ.15  వేలు ఇస్తామని ప్రతిపక్షనేతగా పలు సభల్లో స్వయంగా ప్రకటించారు.

Updated : 22 Apr 2024 06:50 IST

‘అమ్మ ఒడి’లో ఇష్టారాజ్యంగా కోత
ఏటేటా తగ్గిపోయిన లబ్ధిదారుల సంఖ్య

పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు  తమ బిడ్డల విద్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకొచ్చాం. విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులు చేసే లక్ష్యంతో విద్యారంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం. 

 సీఎం జగన్‌ తరచూ పలికే మాటలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం : ‘అమ్మ ఒడి’ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం జగన్‌ వంచించారు. పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ఈ పథకం కింద ఏటా రూ.15  వేలు ఇస్తామని ప్రతిపక్షనేతగా పలు సభల్లో స్వయంగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను బురిడీ కొట్టించేలా హామీలిచ్చిన జగన్‌ అమలు విషయంలో మాయ చేశారు. ఏటా కొత్త నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. పథకానికి అర్హులైనా.. వివిధ కొర్రీలు పెట్టి అనర్హుల జాబితాలో చేర్చారు. అర్హులకైనా ఆ మొత్తం అందిస్తున్నారా అంటే అదీ లేదు. ఒక్కొక్కరికి రూ.15 వేలిస్తామని చెప్పి ప్రతి ఏటా ఆ మొత్తంలో కోత పెట్టారు. వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల కాలంలో అయిదుసార్లు పథకం లబ్ధి చేకూర్చాల్సి ఉండగా ఇప్పటికి నాలుగు సార్లే అందించారు.

నిధులు మిగుల్చుకునేందుకు: మొదటి రెండేళ్లు మిగిలిన సంక్షేమ పథకాల నిబంధనలనే ‘అమ్మ ఒడి’కీ వర్తింపజేశారు. తర్వాత నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్య తగ్గించి, నిధులు మిగుల్చుకున్నారు. 2021-22లో 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. ఆరు దశల వడపోతతో వేలమందిని అనర్హుల జాబితాలో చేర్చారు. 2022-23లో 75 శాతం హాజరుతోపాటు సగటున విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్లు మించిందంటూ భారీగా కోత విధించారు. అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం నిబంధనలు మార్చడంతో చాలా మంది లబ్ధికి దూరమయ్యారు.

జిల్లాలో తొలి ఏడాది

1.95 లక్షల మందికి లబ్ధి అందించారు. 2020-21లో లబ్ధిదారుల సంఖ్య పెరిగినా.. తర్వాత నుంచి కోత పెట్టారు.
2021-22లో 27 వేల మందిని అనర్హులుగా పేర్కొన్నారు.
2022-23లో 5 వేల మందికి లబ్ధిని దూరం చేశారు.

గతేడాది రూ.2 వేలు కోత: పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. కానీ లబ్ధిదారుల నుంచి రూ.2 వేల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. మొదటి ఏడాది నుంచే పథకం లబ్ధిలో కోత పెట్టారు. తొలి ఏడాది రూ.15 వేలు జమచేసి, తర్వాత మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి వసూలు చేశారు. రెండో ఏడాది రూ.14 వేలు జమ చేశారు. 2021-22, 2022-23లో రూ.2 వేలు కోత పెట్టి తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేశారు.

కాళ్లరిగేలా తిరిగినా: ప్రభుత్వం పెట్టిన కొర్రీలతో చాలా మంది పేర్లు అనర్హుల జాబితాలో చేరాయి. వాటికి సంబంధించి తల్లిదండ్రులు ఎవరిని అడిగినా సరైన సమాధానం రాలేదు. కాల్‌ సెంటర్‌ 1902, స్పందన, సచివాలయల్లో ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోయింది. అనర్హుల జాబితాలో ఉన్న అర్హులు.. కారణాలు అడిగినా సచివాలయ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ చెప్పలేదు. అనర్హుల జాబితాలో పెట్టిన కారణాలను తప్పని నిరూపించుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు నానా తంటాలు పడ్డారు. విద్యుత్తు ఎక్కువ వినియోగిస్తున్నట్లు చూపితే సంబంధిత శాఖ నుంచి ధ్రువపత్రం తెచ్చుకునేందుకు కాళ్లరిగేలా తిరిగారు. భూములెక్కువ ఉన్నాయంటే రెవెన్యూశాఖ నుంచి; కార్లు, బస్సులున్నాయంటే ఆర్టీఏ కార్యాలయం నుంచి ధ్రువపత్రాలు తీసుకునేందుకు అవస్థలు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని