logo

వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!

పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్‌ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు.

Updated : 23 Apr 2024 04:59 IST

లబ్ధిదారుల సంఖ్యలో కోత
జగన్‌ పాలనలో వృద్ధుల కష్టాలెన్నో
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్‌ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. ఓట్ల కోసం అనేక గారడీలు చేశారు. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. పాలన చేపట్టగానే పింఛను సొమ్ము పెంచుతామని, అర్హత ఉన్నవారందరికీ ఇస్తామని ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చారు. అధికార పీఠం ఎక్కగానే ఎక్కడ లేని నిబంధనలు ప్రవేశపెట్టి పేదల పింఛన్లకు కోత పెట్టారు. ఏటికేడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు పథకానికి దూరమయ్యారు. వీరందరూ రాబోయే ఎన్నికల్లో వైకాపాకు తమ ఓటు హక్కుతో సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు.
అప్పుడలా.. ఇప్పుడిలా: తెదేపా హయాంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్లు అందించేవారు. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాల వారు లబ్ధి పొందేవారు. కుటుంబంలో అర్హత ఉన్న వారందరికీ పింఛను ఇస్తామన్న జగన్‌ రేషన్‌ కార్డుకు ఒక పింఛను అనే నిబంధన తీసుకొచ్చారు. ఫలితంగా కుటుంబంలో ఒక్కరికే అందుతుంది. మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెదేపా హయాంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తే తర్వాత నెలలోనే మంజూరు చేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని క్రమంగా పక్కనపెట్టింది. ఆరు నెలలకు ఒకసారి సంక్షేమ పథకాలను కొత్త లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఆరు దశల్లో పరిశీలన చేసి కొత్తవారిని ఎంపిక చేస్తున్నారు. దీంతో అర్హులైన వృద్ధులు, వితంతువులు కొన్ని నెలల లబ్ధి కోల్పోతున్నారు. గతంలో రెండు, మూడు నెలల మొత్తం ఒకేసారి తీసుకునే వీలుండేది. వైకాపా హయాంలో ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో కూలి, అత్యవసర పనులు, శుభకార్యాలు, అనారోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైకాపా ప్రభుత్వంలో పింఛన్ల కోసం అర్జీలు పెట్టుకుని, కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వేలాది మంది పేదలకు సాంకేతిక లోపాల పేరిట లబ్ధిని దూరం చేశారు. సచివాలయాలకు వెళ్తే తొలగింపునకు కారణాలు చెబుతున్న ఉద్యోగులు.. పరిష్కారాలు సూచించటంలేదు.

వేలాది మందికి లబ్ధి దూరం: దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఆరు దశల్లో పరిశీలన చేసి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది అర్హులు పింఛను కోల్పోయారు. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్నారని పేర్కొంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. ఏళ్ల తరబడి లబ్ధి పొందుతున్న పింఛన్లను రద్దు చేశారు. పునరుద్ధరించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. గతేడాది ప్రభుత్వం పింఛను మొత్తం రూ.2,750కు పెంచిన తర్వాత నగరంలో 14,365 మంది లబ్ధిదారులను తొలగించినట్లు ఆరోపణలొచ్చాయి. వారందరికీ పూర్తిస్థాయి అర్హతలున్నా హఠాత్తుగా తొలగించారు.

పెంచడమంటే ఇలాగా:

పింఛను మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఆ పెంపును రూ.2,250 నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ.250 చొప్పున పెంచారు. రూ.1000 పెంచడానికి వైకాపా ప్రభుత్వానికి అయిదేళ్ల సమయం పట్టింది. జిల్లాలో ఫిబ్రవరిలో 1,66,564 మందికి పింఛను అందించారు. ఏప్రిల్‌లో లబ్ధిదారులు 1,65,432 మందిగా పేర్కొన్నారు. రెండు నెలల వ్యవధిలో 1,132 పింఛన్లు తొలగించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని