logo

మాట తప్పారు.. మడమ తిప్పారు..

రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు.

Updated : 24 Apr 2024 05:08 IST

  మద్యం విచ్చలవిడి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం 
 ఆదాయార్జనే ధ్యేయంగా విక్రయాలు

 పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. పల్లెలు, పట్టణాల్లో మద్యాన్ని ఏరులై పారేలా చేశారు. ఆదాయార్జనే ధ్యేయంగా తమకు అనుకూలమైన వారితో నాసిరకం మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వేలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అలాంటి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో మద్యానికి నిర్ధిష్టమైన బ్రాండ్‌లు ఉండేవి. జగన్‌ ప్రభుత్వంలో అర్థంపర్థం లేని బ్రాండ్లతో వస్తున్న మద్యం తాగిన వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మద్యం అలవాటును దూరం చేసి మంచి మార్గంలో నడిపించాల్సిన ప్రభుత్వం ధరలు పెంచితే దూరమవుతారని చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది.

  •  నాణ్యత లేదు.. డబ్బులు వృథా: ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యత లేని మద్యం కారణంగా డబ్బులు వృథా అవుతున్నాయి. చాలామంది రోజంతా కష్టపడిన సొమ్ములో కొంత మొత్తాన్ని మద్యానికే ఖర్చు చేస్తున్నారు. కల్తీ మద్యం కారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆరోగ్యాన్ని, డబ్బునూ కోల్పోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.  - పి.శ్రీధర్‌, చినముషిడివాడ
  • మేమంతా వీధిన పడ్డాం..: నా భర్త కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆయనకు మద్యం అలవాటు ఉండడంతో నిత్యం తాగేవారు. నాణ్యత లేని మద్యం తరచుగా తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురై తొమ్మిది నెలల క్రితం మరణించారు. దీంతో మా కుటుంబం దిక్కులేనిదైపోయింది. పిల్లలను పోషించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  - శోభన, చినముషిడివాడ
  •  ఎవరిని పలకరించినా అనారోగ్య సమస్యలే..: మా గ్రామంలో చాలామంది రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తారు. వారిలో చాలామంది ప్రతీరోజూ మద్యం తాగుతారు. గతంలో మద్యం తాగినా అనారోగ్యానికి గురైన సందర్భాలు చాలా అరుదుగా ఉండేవి. మూడేళ్ల నుంచి ఎవరిని అడిగినా ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. మద్యం తాగడం వల్లే సమస్యలని వైద్యులు చెబుతున్నారంటున్నారు. గతంలో రాని రోగాలు ఇప్పుడు వస్తున్నాయంటే మద్యంలో కల్తీ ఉండటమేనని అనుకుంటున్నా.  - రాములమ్మ, నరవ
  •  ఇటీవల మరణాలు ఎక్కువయ్యాయి: గత మూడేళ్లుగా చాలామంది యువకులు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనికి కారణం యువత అధికంగా మద్యం తాగడమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించి మద్యం అమ్మడం విడ్డూరంగా ఉంది. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పిన జగన్‌ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.  - ఈశ్వరమ్మ, వృద్ధురాలు
  •  ఎక్కడికక్కడ బెల్టుషాపులు: వైకాపా ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. ఎక్సైజ్‌ పోలీసులకు పలుమార్లు  ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యత లేని రకరకాల మద్యం తయారీకి ఈ రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారు.  - పి.రామారావు, భరణికం
  •  రాబడి కోసమే నాసిరకం మద్యం..: మద్యం మీద వచ్చే రాబడికి అలవాటు పడిన వైకాపా ప్రభుత్వం నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ మద్యం తాగి యువకుల ఆరోగ్యం సైతం క్షీణించి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే తప్ప మార్పురాదు. దీనికి ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో పనిచేయాలి.  

జి. సామ్రాట్కుమార్‌, అమృతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని