logo

జగనన్న వస్తే తప్పని తిప్పలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్‌ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్‌ వస్తారని షెడ్యూల్‌లో తెలిపారు. 

Updated : 24 Apr 2024 05:07 IST

మండుటెండలో జనానికి అగచాట్లే.. 

ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద  బస్సు నుంచి కిందికి దిగుతున్న జగన్‌

పీఎంపాలెం, ఆనందపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్‌ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్‌ వస్తారని షెడ్యూల్‌లో తెలిపారు. ఈ క్రమంలో వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జీవీఎంసీ 5, 6, 7, 8 వార్డుల నుంచి ఆటోలు, బస్సుల్లో జనాన్ని 8 గంటలకే స్టేడియం వద్దకు తరలించారు. వీరికి పార్టీ జెండాలు, టోపీలు, టీషర్టులు ఇచ్చి రోడ్లకు ఇరువైపులా నిలబెట్టారు. జనసమీకరణ సరిగ్గా లేదన్న సమాచారంతో జగన్‌ శిబిరం నుంచి సమయానికి బయలు దేరలేదు. దీంతో ఎండకు తాళలేక వచ్చిన కొద్ది మంది పరిసరాల్లో నీడ కోసం నానా పాట్లు పడ్డారు.

స్టేడియం ఎదురుగా ఉన్న షాపింగ్‌మాల్‌ వద్దకు ఎక్కువ మంది పరుగులు తీశారు. అది గమనించిన నాయకులు జగన్‌ వస్తున్నారంటూ వారిని బలవంతంగా తీసుకు వచ్చి మళ్లీ ఎండలో నిల్చోబెట్టారు. ఎంత ఎదురు చూసినా జగన్‌ బయటకు రాకపోవడంతో జనం చెట్లు, బస్సులు, ఆటోల పక్కన నీడ కోసం వెదుక్కోవాల్సి వచ్చింది. నేతలు చెబుతున్నా కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు సీఎం ఎప్పుడు బయలుదేరుతున్నారో తెలియక పోలీసులు రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిపి వేయడంతో మండుటెండలో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూడలిలో వాహనాలను అరగంటకు పైగా కదలనీయకుండా చేయడంతో సహనం కోల్పోయిన వాహనదారులు హారన్లు కొడుతూ నిరసన తెలియజేశారు. పేర్కొన్న సమయానికి రెండు గంటలు ఆలస్యంగా స్టేడియం వద్దకు వచ్చిన జగన్‌ ఉన్న కొద్ది పాటి జనానికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. కారుషెడ్డు, మధురవాడ, కొమ్మాది, మారికవలస, బోయపాలెం కూడళ్లలో సైతం జన స్పందన లేకపోవడంతో బస్సులోపలి నుంచే చేతులూపుతూ వెళ్లిపోయారు. అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెంలో జరిగిన వైకాపా సోషల్‌ మీడియా ప్రతినిధుల సమావేశంలో జగన్‌ పాల్గొన్నారు.

 

స్టేడియం వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు