logo

సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ

అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్‌.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.

Published : 20 May 2024 03:36 IST

సారవకోట, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్‌.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒడిశాకు చెందిన శ్రీధర్‌తో పరిచయమైంది. సారవకోట, పాతపట్నం ప్రాంతాల్లో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయవచ్చునని శ్రీధర్‌ నమ్మించాడు. భూమి చూపిస్తానని, సదరు భూములకు చెందిన వ్యక్తులకు కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పడంతో మణికంఠ రూ.10 లక్షలు నగదు తీసుకుని వచ్చాడు. మణికంఠతో పాటు యువరాజు, మరో వ్యక్తి కలిసి సారవకోట మండలంలోని ధర్మలక్ష్మీపురం వద్ద శనివారం కారు నిలిపారు. పాతపట్నం వైపు నుంచి శ్రీధర్‌తో పాటు మరో ఇద్దరు వచ్చి మణికంఠను కలిశారు. పది నిమిషాల వ్యవధిలో పాతపట్నం వైపు నుంచి కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని పరిచయం చేసుకుని వాహనం తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకొని, ఎన్నికల వేళ ఇంత నగదు తరలించకూడదని, ఈ నగదును డీఎస్పీ కార్యాలయానికి అందజేస్తామని చెప్పి, శ్రీధర్‌తో పాటు ఆయనతో ఉన్న మరో ఇద్దరిని వాహనంలో ఎక్కించుకుని సారవకోట వైపు వెళ్లిపోయారు. కొంత సేపటి తరువాత శ్రీధర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన మణికంఠ సారవకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు. నరసన్నపేట సీఐ బి.ప్రసాదరావు సారవకోట పోలీస్‌స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని