logo

రెచ్చిపోతే చిక్కులే..

పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది.

Published : 20 May 2024 03:57 IST

ఉద్రిక్తతల నివారణపై పోలీసుల దృష్టి
లూజ్‌ పెట్రోలు అమ్మకంపై ఆంక్షలు

నర్సీపట్నంలో రౌడీలను హెచ్చరిస్తున్న సీఐ కాంతికుమార్, ఎస్సైలు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు... అన్న అంశాలపైనే చర్చ జరుగుతోంది. ఎంత పందెం అంటూ కొందరు రెచ్చిపోతున్నారు. ఈ తరహా వాతారణమే ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాద ఉంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు పూర్తయి కొద్దిరోజులు గడిచేవరకు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలొచ్చాయి. ఎన్నికల సంఘం నుంచి తాజాగా కొన్ని మార్గదర్శకాలు వచ్చాయి. 

  • పెట్రోలు బంకుల్లో జూన్‌ 10 వరకు విడిగా పెట్రోలు, డీజిల్‌ అమ్మవద్దని పోలీసులు అన్ని బంకుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నర్సీపట్నం టౌన్‌లో ఆదివారం ఉదయం 11 బంకుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రక్రియ అన్నిచోట్లా సాగుతోంది. సీసా, డబ్బా, పీపాతో పెట్రోలు, డీజిల్‌ నింపవద్దని సూచించారు. భౌతిక దాడులకు పెట్రోలు వినియోగించే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు.
  • రెచ్చగొట్టేవారిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించారు. నర్సీపట్నం టౌన్‌లో మూడునెలల క్రితం నుంచే దాదాపు 450 మందిని గుర్తించి మండల మేజిస్ట్రేట్‌ వద్ద బైండోవర్‌ చేయించారు. పోలింగ్‌ నాడు కొందరు శాంతిభద్రతలకు భంగం కలించేలా వ్యవహరించడం గమనించి తాజాగా మరో నర్సీపట్నంలో మరో ముగ్గురు యువకులను మండల మేజిస్ట్రేట్‌ వద్ద బైండోవర్‌ చేయించారు. ఓట్ల లెక్కింపు వరకు ఎవరికి అనుకూలమైన విశ్లేషణలు వారు చేస్తుంటారు. వీధుల్లో ఇలాంటి చర్చలు జరిగినప్పుడు మాటామాటా పెరుగుతుంది. ఇలాంటిచోట్ల కొందరు జోక్యం చేసుకుని అగ్నికి ఆజ్యం పోస్తుంటారు. ఇలాంటివారిపై పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. సెక్షన్‌ 144 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. పోలీసులు గస్తీ తిరుగుతూ ఎక్కడైనా నలుగురు మించి గుమికూడి ఉంటే హెచ్చరించి ఆ ప్రదేశం నుంచి పంపేస్తున్నారు. రాత్రివేళ నిఘా విస్తృతం చేశారు.
  • రౌడీషీటర్లను తరచూ పోలీసు స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారని గుర్తించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తరచూ గొడవలకు దిగేవారిని గుర్తించి అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు. అందరిపైనా నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత జరిగిన స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి... ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నదానిపైనా ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులు తరచూ సెట్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని