logo

తేలని భూసారం.. సాగు నిస్సారం..!

భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్‌ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి.

Published : 20 May 2024 04:05 IST

అయిదేళ్లగా నిలిచిన మట్టి నమూనా పరీక్షలు
ఖరీఫ్‌ వస్తున్నా కానరాని సన్నద్ధత
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి

భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్‌ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. గతంలో ప్రభుత్వమే ఏటా లక్ష్యాలను విధించి మట్టి నమూనాలను సేకరించి, పరీక్షలు చేసి ఫలితాలను కార్డుల రూపంలో రైతులకు అందజేసేది. దీంతో రైతులకు ఎంతోకొంత అవగాహన కలిగి పంటల సాగు విధానంలో మార్పులు చేసుకునేవారు. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాది మట్టి పరీక్షలు చేయలేదు. ఈ ఏడాది 10 వేల మట్టి నమూనాలు సేకరించినా వాటిని పరీక్షించడానికి అవసరమైన రసాయనాలు లేవు. సర్కారు బడ్జెట్‌ విడుదల చేస్తేగానీ వాటిని పరీక్షించి రైతులకు భూసార కార్డులు అందించే పరిస్థితి లేదు. తొలకరి జల్లులు జిల్లాను పలకరించబోతున్నా భూసారం తెలీక రైతులు అయోమయానికి గురవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలోని అనకాపల్లిలో ప్రధాన భూసార పరీక్ష కేంద్రంతో పాటు నర్సీపట్నం, పాడేరులలో కూడా రెండు కేంద్రాలుండేవి. విశాఖపట్నంలో సంచార భూసార ప్రయోగశాలను నడిపేవారు. ఏటా 30 వేలకు పైగా మట్టి పరీక్షలు నిర్వహించేవారు. ఓసారి మట్టి పరీక్ష చేయిస్తే మూడేళ్ల వరకు వాటి ఆధారంగానే ఎరువుల వినియోగం, పంటల సాగు చేయొచ్చు. జిల్లాలో ఆఖరిసారిగా 2018-19లో మట్టి పరీక్షలు చేశారు. ఆ తర్వాత నుంచి వాటి జోలికిపోలేదు. గత ప్రభుత్వం భూసార పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి 25 ఎకరాలను ఒక యూనిట్‌గా తీసుకుని మట్టి నమూనా సేకరించి పరీక్షలు చేయించింది. వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి భూసార పరీక్షలు నిలిచిపోయాయి. 2019లో కేంద్రం కృషి కల్యాణ్‌ అభియాన్‌ ద్వారా అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రంలో ఏడు వేల మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించి చేతులు దులిపేసుకుంది.

శిక్షణ పొందుతున్న వ్యవసాయ శాఖ సిబ్బంది

అతిగానే ఎరువుల వినియోగం

జిల్లాలో వరి, చెరకు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వరికి ఎకరాకు 32 కేజీలు నత్రజని వేయాల్సి ఉండగా 67 కేజీలు వాడుతున్నారు. అదే విధంగా చెరకు పంటకు 45 కేజీలు అవసరం, 101 కేజీలు వేస్తున్నారు. ఇలా అధిక నత్రజని వినియోగించడంతో ఎన్నో నష్టాలు చోటుచేసుకుంటున్నాయి. భూసారం దెబ్బతినడమే కాకుండా, పెట్టుబడులు పెరిగిపోయి రైతులు నష్టపోతున్నారు. భూసారం తెలిస్తే వీటి వినియోగంలో కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మట్టి పరీక్షలు చేయాల్సి వస్తే ఏప్రిల్‌, మే నెలల్లోనే నమూనాలను సేకరించాలి. తర్వాత వ్యవసాయ సీజన్‌ మొదలైపోతుంది. పరీక్షలు చేసినా ఫలితాలు అందడంలో జాప్యం తప్పదు.

ప్రయోగశాలలున్నా.. పరీక్షలు సున్నా..

చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, మాడుగులలో వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ల్యాబ్‌ను రూ.60 లక్షల ఖర్చుతో నిర్మించారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో రూ.3 కోట్లుతో జిల్లా స్థాయి ప్రయోగశాల నిర్మించారు. వీటిలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు అంతగా ప్రయోజనం ఉండటం లేదు. ఎక్కువ మంది రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచే విత్తనాలు కొనుగోలు చేస్తారు. తిరిగి వాటిని పరీక్షలు చేయించడం లేదు. ఈ ల్యాబ్‌ల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని ఎప్పటి నుంచో రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత ఏడాది ల్యాబ్‌లో పరీక్షలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అయితే అందుకు అవసరమైన రసాయనాలు లేకపోవడంతో ఒక్క ప్రయోగశాలలో కూడా మట్టి పరీక్షలు చేయలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని