logo

ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు

ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు.

Updated : 20 May 2024 06:57 IST

పనికి తగ్గట్టుగా దక్కని డబ్బులు
వన్‌టౌన్, న్యూస్‌టుడే

ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు

ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. చెల్లింపులు ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా ఇచ్చారని, పీఓలకు ఒకరకంగా,  ఏపీఓలు, ఓపీఓలకు మరో రకంగా ఇచ్చారని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల పాటు చేసిన గొడ్డుచాకిరీకి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, ఈసీ నిర్ణయించిన మొత్తం ఆమోదయోగ్యంగా లేదని వాపోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశంతో పాటు ఈసీతో కూడిన వ్యవహారం కావడంతో పైకి ఏమీ మాట్లాడడం లేదు.

ఈనెల 13న ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1991 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి 6 మంది ఉద్యోగులు వెళ్లారు. ఈ లెక్కన 11,946 మంది ఉద్యోగులను నియమించారు. వీరితో పాటు మరో 20 శాతం మందిని రిజర్వులో ఉంచారు. అంతా కలిపి 13 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వీరంతా 12వ తేదీ ఉదయం 6 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఎన్నికల సామగ్రితో అదే రోజు రాత్రికి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు, ఇతరత్రా పనులు పూర్తి చేసుకొని పడుకొనేసరికి రాత్రి 11 గంటలు దాటిందని, పోలింగ్‌ కేంద్రాల్లో సరైన వసతులు లేవని చెబుతున్నారు. మళ్లీ ఉదయం 4 గంటలకే నిద్రలేచి పోలింగ్‌ ప్రక్రియను చేపట్టామని, అప్పటి నుంచి మళ్లీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్దకు వచ్చి సామగ్రి, ఈవీఎంలు అప్పగించేసరికి 14వ తేదీ ఉదయం అయ్యిందన్నారు. దాదాపు 3 రోజుల పాటు శ్రమించామని, దీనికి తోడు రెండుసార్లు శిక్షణ శిబిరాలకు హాజరయ్యామని వివరించారు. ఇంతా చేస్తే పీఓలకు రోజుకు రూ.350, ఏపీఓలు, ఓపీఓలకు రూ.250ల, భోజన ఖర్చులకు రోజుకు రూ.150 చొప్పున ఇచ్చారని తెలిపారు. జిల్లాలో సేవలందించిన పీఓలకు ఎన్నికల విధులు 3 రోజులు, రెండు శిక్షణ శిబిరాలకు కలిపి రూ.1750, ఏపీఓలకు అయితే రూ.1250ల చొప్పున చెల్లించారు. ఓపీఓలకు రూ.750లు చొప్పున ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పోలింగ్‌ విధులు నిర్వహించే పీఓలకు రూ.2050, ఏపీఓలకు రూ.1550, ఓపీఓలకు రూ.800 చొప్పున ఇచ్చారని, ఇక్కడకు అక్కడకు చాలా తేడా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా రూ.2450లు, కాకినాడలో రూ.2250లు, నెల్లూరులో రూ.2500ల వరకు పీఓలు, ఏపీఓలకు చెల్లించారని మరికొంత మంది ఉద్యోగులు చెబుతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా చెల్లింపులు చేయడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పోల్చితే పోలింగ్‌ ఈసారి చాలా కష్టమైందని, వెళ్లినప్పుడు, వచ్చినప్పుడు చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. గొడ్డు చాకిరి చేయించుకొని తక్కువ మొత్తంలో చేతిలో పెట్టడం పట్ల లోలోపల కుమిలిపోతున్నారు. సెక్టార్‌ అధికారులు, అత్యవసర సేవలందించిన నాలుగో తరగతి ఉద్యోగులకు ఎంత డబ్బులు అనేది ఇంకా ఖరారు కాలేదు. జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగుల చెల్లింపులకు రూ.1.50కోట్లు వరకు ఖర్చు చేశారు. ఈసీ జారీ చేసిన నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశామని, జిల్లా యంత్రాంగం భోజన ఏర్పాట్లు చేసినందున భోజన ఖర్చులు మినహాయించామని అధికారులు చెబుతున్నారు. పీఓకు రూ.350, ఏపీఓ, ఓపీఓలకు రూ.250 చొప్పున రోజుకు ఇచ్చామని, రెండు రోజులే ఎన్నికల విధులు చేసినప్పటికీ రాత్రంతా పని చేసినందున 14వ తేదీన లెక్క వేసి 3 రోజులకు చెల్లింపులు చేశామని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు