logo

సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!

రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్‌శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు.

Published : 20 May 2024 04:38 IST

రైతుబజార్లలో మూతపడ్డ శీతల గిడ్డంగులు
పట్టించుకోని అధికారులు
సామగ్రి పెట్టేందుకే ఉపయోగపడుతున్నాయ్‌
ఈనాడు, విశాఖపట్నం

ఎంవీపీ కాలనీ బజారులోని గిడ్డంగుల వద్ద వాహనాల పార్కింగ్‌ ఇలా..

రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్‌శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు.

తాజా పండ్లు, కూరగాయలు వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో పది టన్నుల సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులను గోపాలపట్నం, ఎంవీపీ కాలనీల్లోని రైతుబజారుల్లో నిర్మించారు. కొద్ది రోజులు బాగానే వాటి నిర్వహణ సాగింది. తరచూ వస్తున్న సమస్యలను అధిగమిస్తూ వచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పూర్తిగా వాటిని గాలికొదిలేశారు. ఎంవీపీ కాలనీలోని గిడ్డంగిలో శీతల యంత్రం పనిచేయడం లేదు. ఇతర సాంకేతిక సమస్యలు కొన్ని తలెత్తడంతో దాన్ని పట్టించుకోలేదు. విద్యుత్తు నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఏసీ యూనిట్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కూరగాయలు నిల్వ చేయాల్సిన చోట రైతులు కూరగాయలు తెచ్చే సామగ్రి ఉంచుతున్నారు. వాహనాల పార్కింగ్‌కు  వాడుతున్నారు. గోపాలపట్నంలోని శీతలగిడ్డంగిదీ అదే పరిస్థితి. ఈ గదులు ఎక్కువ సరకు నిల్వ చేసేందుకు వీలు లేక రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

శీతల గిడ్డంగిలో రైతులు ఉంచిన సామగ్రి

కేంద్రీకృతంగానైనా..

నగరంలో 13 రైతుబజార్లు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 1500 మందికిపైగా రైతులు నిత్యం కూరగాయలు విక్రయిస్తుంటారు. వీరిలో సగం మందికి పైగా రైతులు సమీప గ్రామాల నుంచి ఆకుకూరలు, కూరగాయలు తీసుకొస్తారు. మిగిలిన వారిలో ఎక్కువ మంది దుంపలు, ఉల్లి, క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్, అల్లం, అరటి వంటి రకాలను ఇతర ప్రాంతాలను నుంచి కొనుగోలు చేసి తెస్తారు. ఈ సందర్భాల్లో లారీల్లో వచ్చిన సరకు నిల్వకు అనువైన శీతల గిడ్డంగులు లేక ఆరుబయటే ఉంచేస్తున్నారు. అప్పటికే ఎండకి ఎండి, వానకి తడిచిన సరకు సరైన నిల్వ సదుపాయం లేక మరింత పాడవుతోంది. దీంతో రైతులు సైతం నష్టపోవాల్సి వస్తోంది. సీతమ్మధార, పెందుర్తి, నరసింహనగర్‌ , మధురవాడ ఇలా ..అన్ని చోట్ల నిర్మించడం కుదరకపోయినా కేంద్రీకృతంగా కొన్నిచోట్లయినా ఏర్పాటు చేస్తే వినియోగించుకుంటామని రైతులు అంటున్నారు.

పాడైన ఏసీ యూనిట్లు


ఎంవీపీ కాలనీలో పండ్లను మగ్గబెట్టేందుకు ఏర్పాటు చేసిన రైపనింగ్‌ కేంద్రం పనిచేయడం లేదు. దాదాపు అయిదేళ్ల క్రితమే మూలకు చేరింది. కనీసం డిమాండు సమయంలోనైనా అందుబాటులోకి తీసుకురాలేదు. ఏటా దీనిని అందుబాటులోకి తెస్తారనే ఎదురుచూపులే మిగిలాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని