logo

మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!

సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్‌ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు.

Updated : 20 May 2024 04:55 IST

శిథిలావస్థకు చేరడంతో భక్తుల అవస్థలు
కొత్త మార్గానికి తప్పని ఎదురుచూపులు
ప్రసాద్‌ పథకంలో కనిపించని ప్రాధాన్యం
 దేవాదాయ, పర్యాటక శాఖల సమన్వయ లోపం
ఈనాడు, విశాఖపట్నం

శిథిలావస్థకు చేరిన మెట్ల మార్గం ప్రమాదకరంగా ఇలా..

సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్‌ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. అధికారులు అదిగో, ఇదిగో అంటున్నారే తప్ప అటువైపే చూడడం లేదు. భక్తులు జారి పడిపోతున్నా పట్టడం లేదు. మీద నుంచి బండలు జారి ఇబ్బందులు పడుతున్నా పనులు వేగవంతం చేయలేదు. వర్షాకాలం వచ్చిందంటే బితుకుబితుకుమంటూ వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రాయి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ప్రసాద్‌ పథకం కింద ఇప్పటికే ఆలయం వద్ద పనులు ప్రారంభించారు. మెట్ల నిర్మాణ పనులను ప్రాధాన్యంగా తీసుకొని భక్తుల సౌకర్యార్థం నిర్మించాల్సినప్పటికీ ఆ దిశగానే ఆలోచన చేయడం లేదు. దేవాదాయ, పర్యాటక శాఖల సమన్వయ లోపం భక్తులకు శాపంగా మారుతోంది. 

అప్పట్లో మంత్రి చెప్పినా..

గత ఏడాది దేవాదాయ శాఖ మంత్రి మెట్ల మార్గం నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్యంగా ఫొటోలు తీయించి అధ్వానంగా ఉన్న తీరుపై అప్పట్లో అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత కొద్ది రోజులు సక్రమంగా నిర్వహించి ఆ తరువాత గాలికొదిలేశారు. ఇప్పటికైనా ఈ మెట్ల మార్గానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. బొట్లు పెట్టి మొక్కులు చెల్లించుకోవడానికి చాలామందికి వీలు కుదరడం లేదు. 

అసంపూర్తిగా కొత్త మార్గం

ప్రమాదకరంగా..

ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన మెట్లు ప్రమాదకరంగా మారాయి. తొలిపావంచా నుంచి కొండ మీదకు వెళ్లే వరకు అలానే ఉన్నాయి. కొన్ని చోట్ల పట్టు తప్పితే కొండ కిందకు జారిపోయేంత ప్రమాదంగా ఉన్నాయి. శిథిలమైన వాటికి తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టలేదు. అక్కడక్కడ బండరాళ్లు పట్టుతప్పేలా కనిపిస్తున్నాయి. ఆంజనేయస్వామి గుడి, కొండ ధారల వద్ద మెట్లు సక్రమంగా లేవు. కొండ అంచుల వద్ద రక్షణ పలకలు లేవు.

కొండ మీద అన్నదానం, ఇతర క్యాంటీన్లలో వినియోగించిన మురుగు నీరు కొండ మధ్యలోకి వచ్చేసరికి మెట్ల మీదుగా పారుతోంది. అక్కడికి వచ్చేసరికి దుర్వాసనతో భక్తులు ముక్కులు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. వర్షం కురిస్తే ఆకాశధార నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే మార్గం బురదమయమైపోతుంది. తరచూ అక్కడ చాలామంది జారిపడుతుంటారు.

కొత్త మార్గం మధ్యలోనే..

ఏటికేడు పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గానికి ఆనుకొని కొత్తగా మరో మెట్ల మార్గానికి గతంలో చర్యలు తీసుకున్నారు. గిర ప్రదక్షిణ, చందనోత్సవం, ప్రత్యేక రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తడం, పాత మార్గం కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరడంతో దీని ఆవశ్యకతను గుర్తించి ఆ వెంటనే ప్రతిపాదించి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. నిధుల సమస్య కారణంగా పూర్తిచేయలేకపోయారు.

మెట్ల మార్గం విస్తరణకు కొన్నేళ్ల కిందటే పూనుకున్నారు. తొలిపావంచా నుంచి కొండపైన సింహగిరి బస్‌స్టాండు వరకు ఈ మార్గాన్ని విస్తరించాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పాత మెట్లను ఆనుకొని మరో 20 అడుగుల వెడల్పుతో సుమారు వెయ్యికి పైగా నిర్మించాలని భావించారు. అంతేకాకుండా మధ్యలో ఆంజనేయస్వామి గుడి ఆధునికీకరణ, విశ్రాంతి ప్రాంగణం నిర్మాణం, దానికి మరికొంత దూరంలో చాకిధారను అభివృద్ధి చేయాలనుకున్నారు. ఈ ప్రతిపాదనలతో రూ.8 కోట్లకు టెండరు పిలిచి పనులు ప్రారంభించారు. ఆ పనులు ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోయాయి. పూర్తిస్థాయిలో 60 మెట్లు మాత్రమే పూర్తయ్యాయి. తొలిపావంచా నుంచి కొంతవరకు కాంక్రీట్‌ వేసి వదిలేశారు.

ప్రసాద్‌ పథకంలో భాగంగా ఈ మెట్ల మార్గాన్ని త్వరితగతిన పునర్నిర్మిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. పాత మెట్లకు మరమ్మతులతో పాటు కొత్త మెట్ల మార్గాన్ని పూర్తిస్థాయిలో నిర్మించాలని కోరుతున్నారు. ఆంజనేయస్వామి ఆలయం పరిసరాలను పూర్తిగా నవీకరించాలని అడుగుతున్నారు. మిగిలిన పనులను పక్కనపెట్టయినా వీటిని చేయమని కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని