logo

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య సేవలు నిలిపివేయాలని జిల్లాలోని 14 నెట్వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి.

Published : 23 May 2024 05:18 IST

జిల్లాలో రూ. 42.56 కోట్ల బకాయిలు 

బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య సేవలు నిలిపివేయాలని జిల్లాలోని 14 నెట్వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈమేరకు అనకాపల్లిలోని ఉషాప్రైమ్‌ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ ట్రస్టు, జిల్లా వైద్య అధికారులకు నోటీసులు ఇచ్చింది. దీంతో సేవలు నిలిచిపోతాయని రోగుల్లో ఆందోళన నెలకొంది.

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రారంభంలో మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని, వ్యయ పరిమితి రూ. 25 లక్షలు వరకు పెంచామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవానికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పథకానికి తూట్లు పొడుస్తోంది. ఆసుప్రతులకు బకాయిలు చెల్లించకపోవడంలో ఏళ్ల తరబడి తీవ్ర అలసత్వం వహించింది. ప్రచార ఆర్భాటాలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం గమనార్హం.  
జిల్లాలో 5,04,902 ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఉన్నారు. నెట్వర్క్‌ పరిధిలో 14 ఆసుపత్రులు ఉండగా వీటిలో ప్రైవేటు రంగానికి చెందినవి ఆరు, ప్రభుత్వ రంగ పరిధిలో ఎనిమిది ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో రోజుకు సుమారు 800 మంది వరకు వైద్య సేవలు పొందుతుండగా, 150 వరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 24,045 మంది వరకు రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందారు. ఎక్కువ మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ ఆసుపత్రులకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. వైద్య పరికరాలు, మందుల కంపెనీలకు బిల్లులు చెల్లించలేకపోతున్నామని నెట్ వర్క్‌ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ఈ పథకం కింద రూ.42.56 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.  గత ఏడాది ఆగస్టు నుంచి సరిగా బకాయిలు చెల్లించలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కొత్త ప్రభుత్వం వస్తే మా బిల్లులు సంగతి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించేందుకు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఇతర శస్త్రచికిత్సలు అవరమయ్యే సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇకపై నగదు చెల్లించి వైద్యం పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. 

 


సేవలు నిలిచిపోకుండా చర్యలు

జిల్లాలోని 14 నెట్వర్క్‌ ఆసుపత్రుల్లో ఎక్కడా ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు నిలిచిపోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడుతున్నాం. అనకాపల్లిలోని ఒక ఉషాప్రైమ్‌ ఆసుపత్రిలోనే సేవలు నిలిపివేస్తున్నట్లు రెండు రోజుల ముందు నోటీసు ఇచ్చారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 42.56 కోట్లు ఉన్నాయి. బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. 
డా.ఐ.రంజిత్, జిల్లా కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు