logo

బాలుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

బి.ఎన్‌.రోడ్డులో మత్స్యవానిపాలెం కూడలిలో బుధవారం సాయంత్రం గగన్‌ (9) అనే బాలుడిని నర్సీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

Published : 23 May 2024 05:25 IST

చక్రం కిందపడి విరిగిన చెయ్యి

బాలుడిని బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్తున్న బంధువులు
రావికమతం, న్యూస్‌టుడే: బి.ఎన్‌.రోడ్డులో మత్స్యవానిపాలెం కూడలిలో బుధవారం సాయంత్రం గగన్‌ (9) అనే బాలుడిని నర్సీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడి చెయ్యి బస్సు చక్రం కిందపడి విరిగింది. చింతపల్లి ప్రాంతానికి చెందిన ఈ బాలుడు తల్లిదండ్రులతో కలిసి మత్స్యవానిపాలెంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కూడలిలోని ఫ్యాన్సీ షాపులో చాక్లెట్లు కొనుక్కొడానికి వస్తూ రోడ్డు దాటుతుండగా చోడవరం వైపు నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ బాలుడిని ఢీకొట్టింది. డ్రైవర్‌ అప్రమత్తతతో బస్సును ఆపడంతో ఆ పిల్లాడికి ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గగన్‌ను బంధువులు, ఆర్టీసీ డ్రైవర్‌ అదే బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. 


వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

కోటవురట్ల, న్యూస్‌టుడే: సైకిల్, బైకు ఢీ కొని రైతు మృతి చెందిన ఘటన కోటవురట్ల మండలం యండపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... యండపల్లి గ్రామానికి చెందిన రైతు గుడివాడ అప్పలనాయుడు(46) గ్రామ సమీపాన ఉన్న తన పొలం పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని సన్యాసిరాజుపాలెం గ్రామానికి చెందిన గంజి కన్నబాబు అన్నవరంలో ఉన్న తన బంధువుల ఇంటికి బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో సైకిల్‌ను వెనుక నుంచి బైక్‌తో ఢీ కొట్టడంతో అప్పలనాయుడు రోడ్డుపై కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై రమణయ్య తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. 

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై లక్కవరం వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై సింహాచలం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నక్కపల్లి మండలం దోసలపాడుకు చెందిన పల్లా లక్ష్మణరావు, ముకుందరాజుపేటకు చెందిన కె.రమణ, అదే మండలం డెంకాడ గ్రామానికి ఉద్దండం గిరీష్, కాసారపు నాగేంద్ర రెండు ద్విచక్ర వాహనాలపై గాజువాక తాపీ పనికి వెళ్తున్నారు. ఎలమంచిలి మండలం లక్కవరం వద్ద లక్ష్మణరావు, రమణ వెళ్తున్న బైక్‌ లారీని తప్పించబోయి ముందు వెళ్తున్న గిరీష్‌ వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు, గిరీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణరావు (42) మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

ఏలేరు కాలువలో మృతదేహం

కశింకోట, న్యూస్‌టుడే: తీడ సమీపంలోని ఏలేరు కాలువలో వ్యక్తి మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. ఏఎస్సై కె.రమణమ్మ  కథనం ప్రకారం.. మాకవరపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన రాజాన మల్లేశ్వరరావు (44) మంగళవారం ఏలేరు కాలువ వద్దకు బహిర్భూమికి దిగి ప్రమాదవశాత్తు జారిపోయాడు. ఈత రాక మునిగిపోయాడు. మృతదేహం ఉదయం ఇక్కడికి కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని