logo

ఇంజినీరింగ్‌ అధికారులపై కమిషనర్‌ ఆగ్రహం

నత్తనడకన సాగుతున్న జీవీఎంసీ జోన్‌-2 కార్యాలయం ఆధునికీకరణ పనులను పరిశీలించిన కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 23 May 2024 06:32 IST

జీవీఎంసీ జోన్‌-2 కార్యాలయం ఆధునికీకరణ పనుల పరిశీలన

అధికారులను ప్రశ్నిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ 
కొమ్మాది, న్యూస్‌టుడే: నత్తనడకన సాగుతున్న జీవీఎంసీ జోన్‌-2 కార్యాలయం ఆధునికీకరణ పనులను పరిశీలించిన కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇంజినీరింగ్‌ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంచాయతీ నాటి కాలంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని అన్ని హంగులతో ఆధునికీకరించేందుకు రూ.50 లక్షల జీవీఎంసీ నిధులు కేటాయించారు. ఇందుకు సంబంధించిన పనులు రెండు నెలలుగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఆయా పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోందని అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటం, కిటికీల గ్రిల్స్‌ తుప్పు పట్టడం, సన్‌సేడ్‌లు పెచ్చులూడటం, భవనాలపై మొక్కలు మొలిచి ఉండటంతో మరింత మండిపడ్డారు. 

  • రూ.లక్షల విలువైన సోలార్‌ వ్యవస్థను నిరుపయోగంగా వదిలేయటం, జోన్‌-2గా మార్చాల్సిన సౌకర్యం కేంద్రం బోర్డును జోన్‌-1గానే కొనసాగించడం తదితర వాటిని పరిశీలించి అధికారులు ఎవరూ బాధ్యతతో విధులు చేపట్టడం లేదన్నారు.  యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఈ నెలాఖరులోపు కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పర్యవేక్షక ఇంజినీర్‌ శ్యామ్‌సన్‌రాజుకు ఆదేశాలు జారీ చేశారు. 
  • ఐటీ సెజ్‌ వద్ద ఆదిత్య బహుళ సముదాయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ సెజ్‌ పార్కును, టెన్నిస్‌ కోర్టు పనులను కమిషనర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఐటీ సెజ్‌ రహదారికి ఇరువైపులా ఉన్న అనధికార బడ్డీలను వెంటనే తొలగించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈఈ శాంతిరాజు, ఏఎంహెచ్‌వో డాక్టర్‌ కిశోర్, డీఈ వంశీ, ఏడీహెచ్‌ సురేష్, టీపీవో వరప్రసాద్‌  పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని