logo

ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు ఆర్‌ఓలదే బాధ్యత

ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ మల్లికార్జున రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 23 May 2024 05:43 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, చిత్రంలో ఏడీసీ కేఎస్‌ విశ్వనాథ్, కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, జేసీ మయూర్‌ అశోక్‌ తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ మల్లికార్జున రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 4న ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో  ఓట్ల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన ఆర్‌ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పిదాలకు ఆర్‌ఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి వారిలో ఉండే అపోహలను తొలగించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్ల నిర్మాణం, రాజకీయ పార్టీల ఏజెంట్లకు గుర్తింపు కార్డుల జారీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈనెల 31వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ గది, సెల్‌ఫోన్లు భద్రపరిచే కేంద్రం ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ ఈనెల 25న ఉంటుందని, రెండో విడత జూన్‌ 2న నిర్వహిస్తామని చెప్పారు. వారికి ఈనెల 27న శిక్షణ ఇస్తామన్నారు. కౌంటింగ్‌ సమయానికి ఒక్క నిమిషం ముందు వరకు వచ్చే పోస్టల్‌ బ్యాలట్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, అదనపు కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్, జేసీ మయూర్‌ అశోక్, డీఆర్వో మోహన్‌కుమార్, ఆర్డీఓలు హుస్సేన్‌ సాహెబ్, కె.భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఓలు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు