logo

ఎన్నికల సమయంలో కబ్జా పర్వం

ఎన్నికల క్రతువులో అధికారులు నిమగ్నమైన వేళ.. అదే అదనుగా స్థానిక నేతల అండదండలతో కొందరు మధురవాడ శివశక్తినగర్‌ సమీపంలో కొండను తవ్వి భారీగా రేకులషెడ్లను నిర్మించారు

Published : 23 May 2024 05:46 IST

కొండను తవ్వి నిర్మాణాలు 
తొలగించేందుకు వెళ్లిన అధికారులపై నేతల ఒత్తిళ్లు

ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన జేసీబీని అడ్డుకుంటున్న స్థానికులు 

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఎన్నికల క్రతువులో అధికారులు నిమగ్నమైన వేళ.. అదే అదనుగా స్థానిక నేతల అండదండలతో కొందరు మధురవాడ శివశక్తినగర్‌ సమీపంలో కొండను తవ్వి భారీగా రేకులషెడ్లను నిర్మించారు. ఇప్పటికే మధురవాడ ప్రాంతం ఆక్రమణలకు అడ్డాగా మారింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఖాళీ స్థలం కనబడితే చాలు ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. సర్వేసంఖ్య 27లో స్థలాలకు అధిక రేటు పలకడంతో కొండలను సైతం పిప్పి చేసి నిర్మాణాలు సాగిస్తున్నారు. గత పది రోజులుగా శివశక్తినగర్‌ దరి శ్రీలక్ష్మీనగర్‌కు ఆనుకుని ఉన్న కొండపై పదుల సంఖ్యలో రేకులషెడ్లు, పునాదులు నిర్మించారు. వీటిని తొలగించాల్సిన రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో పోలీసుల సహకారంతో రెవెన్యూ సిబ్బంది వాటిని తొలగించేందుకు బుధవారం రంగ ప్రవేశం చేశారు. అయితే సిబ్బందిని, స్థానికులు ఆక్రమణదారులు అడ్డుకున్నారు. స్థానిక నేతలతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఆర్‌ఐ ప్రవీణ్, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది వెనుదిరిగారు. కనీసం చదును చేసిన స్థలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టకుండా, పునాదులను సైతం కూల్చకుండా  అధికారులు వెళ్లిపోవడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని నిర్మాణాలు చేసుకోవచ్చని.. తొలగింపులు ఉండవని ఆక్రమణదారులు చెబుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని